ఆ నాలుగు వేరియంట్లతోనే చైనాలో కరోనా వ్యాప్తికి : ఎన్ కే అరోరా

ఆ నాలుగు వేరియంట్లతోనే చైనాలో కరోనా వ్యాప్తికి : ఎన్ కే అరోరా


చైనాలో వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కోవిడ్ ప్యానల్ చీఫ్ ఎన్ కే అరోరా తెలిపారు. చైనాలో కరోనా వ్యాప్తికి నాలుగు వేరియంట్లు కారణమని చెప్పారు. చైనా నుంచి సరైన సమాచారం లేనందున.. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడ కొవిడ్‌ వేవ్‌కు పలు రకాల వేరియంట్లే కారణమని వివరించారు. బీఎఫ్.7 వేరియంట్‌ కేసులు కేవలం 15శాతమే అని తెలిపారు. బీఎన్‌, బీక్యూ వేరియంట్ల నుంచి 50 శాతం కేసులు వస్తుండగా.. ఎస్‌వీవీ వేరియంట్‌ నుంచి మరో 15 శాతం కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. దీంతో రోగుల్లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. 

మరోవైపు భారత ప్రజల్లోని హైబ్రీడ్‌ ఇమ్యూనిటీ కారణంగా భయపడాల్సిన పనిలేదని అరోరా చెప్పారు. ఇది వ్యాక్సిన్ల ద్వారా, ఇన్ఫెక్షన్ల ద్వారా, కొవిడ్‌ తొలి, ద్వితీయ, తృతీయ వేవ్‌ల కారణంగా లభించిందన్నారు. ఇక చైనాలో వారికి ఇది కొత్త.. వారు ఇంతకు ముందు ఇన్ఫెక్షన్‌ బారిన పడలేదన్నారు. అలాగే.. దీనికి తోడు వారు తీసుకున్న వ్యాక్సిన్లు ప్రభావవంతమైనవి అని.. అక్కడి ప్రజలు మూడు, నాలుగు డోసులు తీసుకున్నారని అరోరా తెలిపారు. చైనాతో పోల్చుకుంటే భారత్ లో 97 శాతం మంది మాత్రమే రెండు డోసులు తీసుకున్నారని ఆయన వివరించారు. మిగిలిన వారు ఒక్కసారైనా కోవిడ్ బారిన పడిన వారు ఉన్నారని తెలిపారు. ముందు జాగ్రత్త ఉంటే మంచిదన్న ఆయన.. భారత ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.