సముద్రాల్లో ప్లాస్టిక్ గుట్టలు.. 170 ట్రిలియన్​ల మైక్రో ప్లాస్టిక్

సముద్రాల్లో ప్లాస్టిక్ గుట్టలు.. 170 ట్రిలియన్​ల మైక్రో ప్లాస్టిక్
  • 2040 నాటికి మూడు రెట్లు పెరిగే చాన్స్.. ‘‘ది 5 గైర్స్ ఇన్​స్టిట్యూట్” స్టడీలో వెల్లడి

న్యూఢిల్లీ : భూమి మీదే కాదు.. సముద్రంలోనూ ప్లాస్టిక్ వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. దీంతో సముద్రపు జీవుల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని అమెరికాకు చెందిన ‘‘ది 5 గైర్స్ ఇన్​స్టిట్యూట్” ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహా సముద్రాల్లో దాదాపు 170 ట్రిలియన్ల ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయని వివరించింది. వీటి బరువు 2 మిలియన్ టన్నులు ఉంటుందని తెలిపింది. 1979 నుంచి 2019 మధ్య  సముద్రాల్లోని ప్లాస్టిక్​పై స్టడీ చేసినట్టు ది 5 గైర్స్​ఇన్​స్టిట్యూట్ వివరించింది. 2005 నుంచి సముద్రాల్లో ప్లాస్టిక్​ పొల్యూషన్ చాలా పెరిగిందని, దీన్ని ఆపకపోతే 2040 నాటికి వ్యర్థాలు మూడు రెట్లు పెరుగుతాయని హెచ్చరించింది. ప్లాస్టిక్ నివారణకు చట్టబద్ధమైన విధానాలు తీసుకురావాలని, ప్లాస్టిక్ నష్టాలపై ప్రపంచవ్యాప్తంగా క్యాంపెయిన్ చేయాలని తెలిపింది.

సముద్రపు అంచుల దాకా మైక్రో ప్లాస్టిక్స్

నదులు, తీర ప్రాంతాల నుంచే ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలుస్తున్నాయని ది 5గైర్స్ ఇన్​స్టిట్యూట్ తెలిపింది. 2005 తర్వాత ప్లాస్టిక్ తయారీతో పాటు యూసేజ్ కూడా పెరిగిందని, దీంతో భూమిపై కూడా వీటి వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయని వివరించింది. మహా సముద్రాల్లో మైక్రో ప్లాస్టిక్స్ పెరిగిపోవడంతో ఇప్పుడు ప్రపంచ స్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉందని ది 5 గైర్స్ ఇన్​స్టిట్యూట్ కో ఫౌండర్ డాక్టర్ మార్కస్ ఎరిక్సెన్ అభిప్రాయపడ్డారు. క్లీనప్​తో పాటు రీ సైక్లింగ్​పై దృష్టి పెట్టడం మానేయాలన్నారు. అసలు ప్లాస్టిక్ తయారు చేయకపోతే వీటి అవసరమే ఉండదని అభిప్రాయపడ్డారు. సముద్రపు అంచుల్లో నివసించే జీవుల్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ బయటపడుతున్నాయని వివరించారు. ఇది సముద్రపు జీవుల మనుగడకే ప్రమాదకరమని హెచ్చరించారు. 

ఆరు మెరైన్​ రీజియన్స్​లో స్టడీ

1979 నుంచి 2019 మధ్య ఆరు ప్రధానమైన మెరైన్ రీజియన్స్​లోని 11,777 ఓషియన్​ స్టేషన్స్ ప్లాస్టిక్ పొల్యూషన్​ డేటాపై ది 5 గైర్స్ ఇన్​స్టిట్యూట్ స్టడీ చేసింది. మైక్రో ప్లాస్టిక్స్ సముద్రాలకు ఎంతో ప్రమాదకరమని తేల్చింది. నీరు పొల్యూట్ కావడంతో పాటు ప్లాస్టిక్​ను ఫుడ్ అనుకొని సముద్రపు జీవులు తినడంతో వాటి ​ ఆర్గాన్స్​ దెబ్బతింటున్నాయని చెప్పింది.