భారత్ కు భయపడం.. గెలిచేదాకా పోరాడతాం

భారత్ కు భయపడం.. గెలిచేదాకా పోరాడతాం

లండన్: ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్ లో భారత్ ముందంజలో ఉంది. తొలి టెస్టులో గెలిచే పొజిషన్ లో ఉన్న టీమిండియా.. వర్షం దెబ్బతో మ్యాచ్ డ్రా అయ్యింది. అయితే రెండో టెస్టులో ఓటమి అంచుల్లో నుంచి విక్టరీ కొట్టి సిరీస్ లో  ఆధిపత్యంలో నిలిచింది. పేసర్లు మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా ఇటు బౌలింగ్ అటు బ్యాటింగ్ లో చెలరేగి ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో అనూహ్య ఓటమిపై ఇంగ్లండ్ టీమ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వర్ వుడ్ స్పందించాడు. భారత్ పై ఓటమి తమకు బాధ కలిగించిందని.. కానీ పోరాటాన్ని ఆపబోమని సిల్వర్ వుడ్ చెప్పాడు. 

'భారత్ పై ఓటమి మమ్మల్ని నిరాశ పర్చింది. కానీ మేం ఫైట్ ను ఆపం. మేం దేనికీ భయపడం. మ్యాచ్ లో మేం పలుమార్లు ఇండియా మీద ఆధిపత్యం కనబరిచాం. కీలక టైమ్ లో పర్యాటక జట్టు మాపై పైచేయి సాధించింది. టెస్టు క్రికెట్ లో ఉండే మజా ఏంటో ఈ మ్యాచ్ ద్వారా మరోమారు నిరూపితమైంది. ఇరు దేశాలకు ప్రాతినిధ్యం అందిస్తున్న ప్లేయర్లు మ్యాచ్ లో కొన్ని సార్లు మాటలతో తమ భావోద్వేగాలు చూపించారు. దీన్ని నేను ఎంజాయ్ చేశా' అని సిల్వర్ వుడ్ పేర్కొన్నాడు.