పతంజ‌లి మందు ‘క‌రోనిల్’ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్.. నిమ్స్ హాస్పిట‌ల్‌కు నోటీసులు

పతంజ‌లి మందు ‘క‌రోనిల్’ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్.. నిమ్స్ హాస్పిట‌ల్‌కు నోటీసులు

క‌రోనాకు మందు అంటూ ప‌తంజ‌లి ప్ర‌క‌టించిన క‌రోనిల్ ఔష‌ధంపై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించిన ప్రైవేటు ఆస్ప‌త్రికి రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం నోటీసులు జారీ చేసింది. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి లేకుండా క‌రోనా పేషెంట్ల‌కు ఆ మందు ఇవ్వ‌డంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశించింది. ‘రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ (నిమ్స్) ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న క‌రోనా పేషెంట్ల‌కు క‌రోనిల్ మందు ఇచ్చి క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించారు. అయితే దీనికోసం ప్ర‌భుత్వం నుంచి ప‌ర్మిష‌న్ తీసుకోవ‌డంగానీ, క‌నీసం స‌మాచారం ఇవ్వ‌డంగానీ చేయ‌లేదు’ అని జైపూర్ చీఫ్ మెడిక‌ల్ అండ్ హెల్త్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ న‌రోత్త‌మ్ శ‌ర్మ తెలిపారు. ఈ వ్య‌వ‌హారంపై నిమ్స్ యాజ‌మాన్యానికి నోటీసులు ఇచ్చామ‌ని, వారి నుంచి వివ‌ర‌ణ రావాల్సి ఉందని చెప్పారు.

కాగా, మంగ‌ళ‌వారం నాడు క‌రోనాకు మందు అంటూ యోగా గురు రాందేవ్ బాబా ప‌తంజ‌లి త‌యారు చేసిన క‌రోనిల్ మందును విడుద‌ల చేశారు. అయితే అదే రోజు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ మందుపై ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వొద్ద‌ని, దాని త‌యారీ, క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు సంబంధించిన వివ‌రాలు ఇవ్వాల‌ని ఆదేశించింది. అయితే రాందేవ్ బాబా ఈ మందును విడుద‌ల చేసే స‌మ‌యంలో దీనిని హ‌రిద్వార్‌లోని ప‌తంజ‌లి రీసెర్చ్ సెంట‌ర్, జైపూర్‌లోని నిమ్స్‌తో క‌లిసి త‌యారు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే నిమ్స్ హాస్పిట‌ల్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ గురించి తెలియ‌డంతో రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం దాని యాజ‌మాన్యానికి నోటీసులు ఇచ్చింది.