15 రోజుల్లో.. 15 వేల పోలీసు జాబ్స్

15 రోజుల్లో.. 15 వేల పోలీసు జాబ్స్
  • యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లోని పోస్టుల భర్తీ
  • 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీ  పరీక్షలకు రెడీ కావాలి: సీఎం రేవంత్
  • ఆ నలుగురి ఉద్యోగాలు ఊడగొట్టినందుకు.. 
  • 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే
  • త్వరలోనే ఇంకో 64 ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ 
  • రిక్రూట్​మెంట్​లో మరో రెండేండ్ల ఏజ్​ రిలాక్సేషన్​
  • సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని హామీ
  • 441 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేత

హైదరాబాద్‌‌, వెలుగు: రానున్న 15 రోజుల్లో 15 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతామని వెల్లడించారు. నియామకాల బాధ్యతను తీసుకుంటున్నామని, రాష్ట్రంలోని 30 లక్షల నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 64 కొత్త  ఖాళీలతో గ్రూప్ -1 నోటిఫికేషన్ కూడా త్వరలోనే  జారీ చేస్తామన్నారు. నియామకాల్లో ఏజ్​ లిమిట్​ను మరో రెండేండ్లు పెంచాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సింగరేణి సంస్థను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

బుధవారం సెక్రటేరియెట్​ సమీపంలోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, మెమోరియల్‌‌ సెంటర్‌‌ వద్ద  సింగరేణి జాబ్‌‌ మేళా నిర్వహించారు. దీనికి సీఎం రేవంత్​రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్​తో కలిసి 441 మందికి కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. తర్వాత సీఎం మాట్లాడారు. టీఎస్​పీఎస్సీ, సింగరేణి బోర్డు, విద్యుత్​ బోర్డు, పోలీస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు, వైద్య విధాన పరిషత్​ బోర్డు ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీని యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చేపడుతుందని, నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలని సూచించారు. 


గత పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురై నిరాశలో ఉన్న నిరుద్యోగులకు సంపూర్ణ విశ్వాసం కల్పించేందుకే నియామక పత్రాల అందజేత వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా, అంబేద్కర్ విగ్రహ సాక్షిగా నియామకాల పత్రాలను అందజేస్తున్నామని చెప్పారు. ‘‘పరీక్షలు ఆలస్యమవడంతో కొంత మంది వయసు అర్హత కోల్పోతున్నరు. వారికి అవకాశం ఇచ్చేందుకు రెండేండ్లు వయసు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది” అని ప్రకటించారు. 

రాష్ట్ర సాధనలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సింగరేణి కార్మికులు ముందుండి పోరాడారని సీఎం రేవంత్​రెడ్డి కొనియాడారు. ఆర్టీసీ కార్మికులు, విద్యుత్​ కార్మికులతో కలిసి సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మెకు సైరన్​ ఊదారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం సింగరేణి సంస్థ లాభాలను తీసుకొని, సంస్థ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసి ఖాయిలా పడే పరిస్థితిని కల్పించిందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు అనేక అడ్డంకులు సృష్టించిందని అన్నారు. పదేండ్లలో సింగరేణి కార్మికులు ఎంతో నిర్లక్ష్యానికి గురయ్యారని, వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతం మొత్తం కాంగ్రెస్ కు, కమ్యూనిస్టులకు అండగా నిలిచి ప్రజాప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిందని తెలిపారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ పార్టీ అనుబంధ సంఘానికి సింగరేణి ఎన్నికల్లో మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన అన్నారు. 

సింగరేణి కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటం: భట్టి  

గత ప్రభుత్వం బొగ్గు బావులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి సింగరేణి సంస్థను దెబ్బకొట్టేందుకు కుట్ర చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి సంస్థలో 1.05 లక్షల ఉద్యోగాలను గత పాలకులు 42 వేలకు కుదించారని మండిపడ్డారు. సింగరేణి సంస్థను గత పాలకులు రాజకీయాలకు, స్వలాభం కోసం వాడుకున్నారని అన్నారు. పదేండ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజా ప్రభుత్వం రాగానే పారదర్శకంగా నియామకాలు చేస్తామని చెప్పామని, ఉద్యోగ నియామక పత్రాలు అందించి గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టామని తెలిపారు. సింగరేణి కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.

నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇందిరమ్మ పాలనలో నియామక ప్రక్రియ మొదలైందని చెప్పారు. ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై గత రెండు నెలలుగా కొందరు వక్ర భాష్యాలు మాట్లాడుతున్నారని, వారి నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్, పాయం వెంకటేశ్వర్లు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్ సాగర్ రావు, కోవా లక్ష్మీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సింగరేణి ఎండీ బలరాంనాయక్, ఐఎన్‌‌టీయూసీ జనరల్ సెక్రటరీ జనప్రసాద్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య  తదితరులు పాల్గొన్నారు.

సింగరేణిలో స్థానికులకు 80% ఉద్యోగాలు

సింగరేణి లో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారని, ఆయన విన్నపాన్ని అమలు చేయాలని సింగరేణి యాజమాన్యానికి సూచించినట్లు సీఎం రేవంత్​రెడ్డి వెల్లడించారు. సింగరేణి ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించే అంశంపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. సింగరేణి కారుణ్య నియామకాల్లో వయసు సడలింపు అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పారు. 

ఒక కుటుంబం (కేసీఆర్​ కుటుంబం)లోని నలుగురి ఉద్యోగాలు మీరు ఊడగొడితే 441 మందికి ఇప్పుడు ఉద్యోగాలు వచ్చినయ్. ఇది ఇంకా ఆగదు. వాళ్ల ఉద్యోగాలు పోగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను మా ప్రభుత్వం తీసుకున్నది. వాళ్ల ఉద్యోగాలు ఊడగొడితే  మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తయని నేను ఎన్నికల ప్రచారంలో చెప్పిన. చెప్పినట్లే ఇప్పుడు చేస్తున్నం.
- సీఎం రేవంత్​రెడ్డి