
- వింబుల్డన్‌లో మూడో రౌండ్‌లోకి ప్రవేశం
- స్వైటెక్, ఆండ్రీవా, డి మినుయెర్ కూడా..
లండన్: సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్.. వింబుల్డన్‌లో 99వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో ఆరోసీడ్ జొకోవిచ్ 6–3, 6–2, 6–0తో డాన్ ఇవాన్స్ (బ్రిటన్)పై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. దాంతో ఈ రౌండ్‌కు చేరడం జొకో కెరీర్‌లో ఇది 19వ సారి. ఓపెన్ ఎరాలో.. గ్రాస్ కోర్టు మేజర్‌లో అత్యధిక సార్లు మూడో రౌండ్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఇప్పటికే ఫ్రెంచ్, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వంద విజయాలు సాధించిన జొకో.. వింబుల్డన్‌లోనూ రికార్డు సృష్టించడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. గంటా 14 నిమిషాల మ్యాచ్‌లో జొకో 16 బ్రేక్ పాయింట్లలో ఆరింటిని సద్వినియోగం చేసుకున్నాడు. 46 విన్నర్లు కొట్టాడు. ఇవాన్స్ 19 విన్నర్లు, రెండు బ్రేక్ పాయింట్లను కాచుకున్నాడు.
ఇతర మ్యాచ్‌ల్లో డి మినుయెర్ (ఆస్ట్రేలియా) 4–6, 6–2, 6–4, 6–0తో కాజాక్స్ (ఫ్రాన్స్)పై, దిమిత్రోవ్ (రష్యా) 7–5, 4–6, 7–5, 7–5తో మౌటెట్ (ఫ్రాన్స్)పై, మెన్సిక్ (చెక్) 6–4, 3–6, 6–4, 7–6 (4)తో గిరోన్ (అమెరికా)పై, కోబలి (ఇటలీ) 6–1, 7–6 (6), 6–2తో పిన్నింగ్టన్ జోన్స్ (బ్రిటన్)పై నెగ్గారు. విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్‌లో స్వైటెక్ (పోలెండ్) 5–7, 6–2, 6–1తో మెక్‌నల్లీ (అమెరికా)పై, ఆండ్రీవా (రష్యా) 6–1, 7–6 (4)తో బ్రోంజెటీ (ఇటలీ)పై, రిబకిన (కజకిస్తాన్) 6–3, 6-–1తో సకారి (గ్రీస్)పై, క్రెజికోవా (చెక్) 6–4, 3–6, 6–2తో డోలిహైడ్ (అమెరికా)పై, నవారో (అమెరికా) 6–1, 6–2తో కుద్రెమెత్సోవా (రష్యా)పై, అలెగ్జాండ్రోవా (రష్యా) 6–4, 6–0తో లామెన్స్ (నెదర్లాండ్స్)పై గెలిచి తర్వాతి రౌండ్‌లోకి ప్రవేశించారు. మెన్స్ డబుల్స్‌లో శ్రీరామ్ బాలాజీ (ఇండియా)–మిగుయెల్ రీస్ వారెలా (మెక్సికో) 6–4, 6–4తో లర్నెర్ టియాన్–అలెగ్జాండర్ కొవాసివిక్ (అమెరికా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.