ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

 ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

పొదలు నరికినం.. చెట్లు కొట్టలే

పెద్దపల్లి, వెలుగు: కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల తమ ఇండ్లు మునిగిపోతుండడంతో ఇండ్ల స్థలాల కోసం కోయపల్లి పక్కనగల పొదలను మాత్రమే నరికామని, చెట్లను, ప్లాంటేషన్ చెట్లను కొట్టలేదని మంథని మండలం ఖాన్ సాయిపేట గ్రామస్తులు తెలిపారు. తమపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తేయాలని ఖాన్ సాయిపేట గ్రామస్తులు మంగళవారం మంథని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి అటవీశాఖ అధికారులు తమను కేసుల్లో ఇరికించారన్నారు. తమను పోడు భూముల్లో పొజిషన్ కోసం అడవిలోకి తీసుకెళ్లి తలా ఓ చోట నిలబెట్టి ఫొటోలు తీశారని, దీంతో పోడు భూములకు హక్కు పత్రాలు వస్తాయని ఆశపడ్డామన్నారు. తర్వాత అటవీశాఖ అధికారులు అడగడంతో సంతకాలు చేశామన్నారు. కానీ అడవిని ధ్వంసం చేశారని 16 మందిపై కేసులు నమోదు చేశారన్నారు. కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో అటవీశాఖ అధికారులు, పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం మంథని ఎస్సై వెంకటేశ్వర్ కేసులు నమోదైన 12 మందిని రిమాండ్ కు తరలించారు.  

రూ.10 లక్షలు సాయం చేయండి
మేయర్​కు పందుల పెంపకందారుల వినతి

కరీంనగర్ కార్పొరేషన్, వెలుగు: తమకు దళితబంధు మాదిరిగా ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు మంజూరు చేస్తే పందుల పెంపకాన్ని పూర్తిగా మానుకుంటామని నగరానికి చెందిన పందుల పెంపకందారులు మేయర్​సునీల్​రావును కోరారు. మంగళవారం స్థానిక 14వ డివిజన్ లో పందుల పెంపకం దారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరవ్యాప్తంగా పందులు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, జనజీవనానికి దూరంగా వాటిని పెంచాలని సూచించారు. త్వరలో పందుల పెంపకానికి స్థలం కేటాయిస్తామని, అప్పటిదాకా సొంత స్థలంలో పెంచాలని ఆదేశించారు. 5 రోజుల్లోపు నివాస గృహాల వద్ద పందులు తిరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించగా 15 రోజుల గడువు ఇవ్వాలని పెంపకందారులు కోరారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ త్రయంబకేశ్వర్, వెటర్నరీ ఆఫీసర్ శ్రీధర్, కార్పొరేటర్ తిరుపతి పాల్గొన్నారు.

నవంబర్ 29ని మరువలేం

కరీంనగర్ టౌన్, వెలుగు: తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29ని మరువలేమని, ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం నిర్వహించిన దీక్షా దివస్ లో భాగంగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ చౌక్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి మేయర్ సునీల్ రావుతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజని, ప్రజల్లో తెలంగాణ ఆకాంక్షను రేకెత్తించేలా కేసీఆర్ ఆమరణ దీక్షకు పూనుకున్నారని గుర్తు చేశారు. 

ప్రభుత్వానికి, దళితులకు వారధిలా అట్రాసిటీ కమిటీ..

ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కమిటి దళితులకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేయాలని మంత్రి అన్నారు. కలెక్టరేట్ లో నిర్వహించిన అట్రాసిటీ కమిటీ సమావేశంలో కలెక్టర్ కర్ణన్​తో కలిసి మాట్లాడారు. దళితులకు న్యాయం జరిగేలా చూడడమే కమిటీ ముఖ్య ఉద్దేశమని అన్నారు. దళితబంధు యూనిట్లు అమ్ముకోవడం లేదా లీజుకు ఇచ్చినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయా యూనిట్లను రద్దు చేస్తామన్నారు. అనంతరం రూ.12కోట్లతో నిర్మిస్తున్న ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్​పనులను పరిశీలించి జనవరిలోపు అందుబాటులోకి తీసుకొచ్చేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో లీడర్లు చల్లా హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఆర్అండ్ బీ ఈఈ సాంబాశివరావు పాల్గొన్నారు.

పనుల్లో అవకతవకలను ఉపేక్షించం
ఫీల్డ్ అసిస్టెంట్లతో డీఆర్డీఏ పీడీ శ్రీలతారెడ్డి

గంగాధర, వెలుగు : ఈజీఎస్ పథకం ద్వారా చేపట్టే పనుల్లో ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఆర్​డీఏ పీడీ శ్రీలతారెడ్డి హెచ్చరించారు. మంగళవారం గంగాధర మండల కేంద్రంలో ఈజీఎస్ పనుల ప్రగతిపై నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఫీల్డ్ అసిస్టెంట్లు కూలి పనులకు వచ్చే కూలీల హాజరు శాతంతో పాటు చేపట్టిన పనులను మస్టర్లలో విధిగా రాయాలన్నారు. పనుల్లో ఏ గ్రామంలో అవకతవకలు జరిగిన ఫీల్డ్ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం గ్రామాలవారీగా ఈజీఎస్ సేకరించిన అంశాలను, నివేదికలను సామాజిక తనిఖీ బృందం సభ్యులు చదివి వినిపించారు. పలు చోట్ల అవకతవకలు, కూలీలకు అందని వేతనాలు తదితర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సమావేశంలో డీఆర్డీఏ పీడీ సంధ్యారాణి, డీఆర్డీఏ సహ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

మినీ స్టేడియానికి మోక్షమెప్పుడు?
పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ 

వేములవాడ, వెలుగు : పట్టణంలో ఏళ్లుగానే మినీ స్టేడియం పనులు నిలిచిపోయినా పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదని పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని మినీ స్టేడియం ముందు స్థానిక నాయకులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. స్టేడియం నిర్మాణం కోసం 2012లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 కోట్ల 15 లక్షల నిధులు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదన్నారు. స్టేడియం పూర్తయితే వాలీబాల్, షటిల్, క్రికెట్, కబడ్డీ, ఖోఖో బ్యాడ్మింటన్​క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడేది కదా అని ప్రశ్నించారు. వారిలో పార్టీ పట్టణాధ్యక్షుడు కనకయ్య, నాయకులు రాజు కుమార్, రమేశ్, దేవరాజు, పరశురాం తదితరులు పాల్గొన్నారు. 

‘టీఆర్ఎస్ వి ఓటు బ్యాంకు రాజకీయాలు’ 


జగిత్యాల, వెలుగు: బీజేపీ స్టేట్​చీఫ్​బండి సంజయ్ భైంసా సభకు ప్రభుత్వం ముందుగా అనుమతిచ్చి తర్వాత ఓ వర్గం ఓట్ల కోసం రద్దు చేశారని, టీఆర్ఎస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని జిల్లా బీజేపీ లీడర్లు విమర్శించారు. మంగళవారం జగిత్యాలలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. యాత్రపై హైకోర్టు తీర్పు తర్వాత కూడా సంజయ్ జగిత్యాలలో ప్రశాంతతను చెడగొడుతున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో నియోజకవర్గ లీడర్లు పన్నాల తిరుపతి రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ చిలుకమర్రి మదన్​మోహన్, కౌన్సిలర్ పులి శ్రీధర్ పాల్గొన్నారు.

అర్హులందరికీ డబుల్ ఇండ్లు
ఎమ్మెల్యే రవిశంకర్

గంగాధర, వెలుగు : నియోజకవర్గంలోని అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. మంగళవారం బూరుగుపల్లిలోని తన నివాసంలో గంగాధర, రామడుగు, బోయిన్ పల్లి, చొప్పదండి మండలాల తహసీల్దార్లతో డబుల్ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. మల్యాల, కొడిమ్యాల మండలాల్లో ఇప్పటికే ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులు గృహప్రవేశం చేశారన్నారు. చొప్పదండి మండలం ఆర్నకొండలో సంక్రాంతి తర్వాత అందజేస్తామని, గంగాధర, రామడుగు, బోయిన్పల్లి మండలాల్లో త్వరలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. పైరవీలకు తావులేకుండా నిజాయితీగా అధికారులు అర్హుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. 


ఘనంగా మల్లన్న జాతర 

గొల్లపల్లి, వెలుగు : మండలంలోని మల్లన్నపేట గ్రామంలో మంగళవారం మల్లికార్జున స్వామి సట్టెడు వారాల జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామికి బోనాలు, మల్లన్న పట్నాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి కాకుండా అదిలాబాద్ జిల్లా నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.  కోరుట్ల రూరల్:  మండలం ఐలాపూర్ లో శ్రీపూదోట మల్లికార్జున స్వామి జాతర ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం పురాతన దేవాలయంలో మల్లన్న పట్నాలు, శ్రీవారి కల్యాణం ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు మల్లన్న దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు.  

ప్రతి పథకం ప్రజలకు చేరాలి
సర్వసభ్య సమావేశంలో  చైర్మన్​ రాజేశ్వర్​ రావు

జమ్మికుంట, వెలుగు : ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు చేరాలని మున్సిపల్ చైర్మన్​ తక్కళ్లపల్లి రాజేశ్వర్​ రావు అన్నారు. మంగళవారం జమ్మికుంటలో నిర్వహించిన మున్సిపాలిటీ పాలకవర్గ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటి పన్ను, నల్లా పన్నుల చెల్లింపులలో పాలకవర్గం సహకరించాలని కోరారు. అనంతరం ప్రవేశపెట్టిన 25 అంశాలను పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్ పర్సన్​ స్వప్న, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ​