బెంగళూరు.. కాంక్రీట్ జంగిల్.. 50 ఏండ్లలో భారీగా పెరిగిన నిర్మాణాలు

బెంగళూరు.. కాంక్రీట్ జంగిల్.. 50 ఏండ్లలో భారీగా పెరిగిన నిర్మాణాలు
  • పెద్ద సంఖ్యలో చెట్లు నరికేసి అభివృద్ధి పనులు
  • అడుగంటిన భూగర్భ జలాలు
  • డెడ్ స్టోరేజీకి చెరువులు, రిజర్వాయర్లు.. 1055% పెరిగిన కాంక్రీట్ కన్​స్ట్రక్షన్
  • 79 శాతం వాటర్ స్ప్రెడ్ ఏరియా కనుమరుగు
  • ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సైంటిస్టుల వెల్లడి

బెంగళూరు: ఒకప్పుడు ‘గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా’ అంటే బెంగళూరు గుర్తుకొచ్చేది. కానీ.. ఇప్పుడు, బెంగళూరు ‘కాంక్రీట్ జంగిల్’గా మారిపోయింది. డెవలప్​మెంట్ పేరుతో పెద్ద సంఖ్యలో చెట్లు నరికేయడం, ఎత్తైన భవనాలు నిర్మించడంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఒక్క బెంగళూరులోనే ఏడు వేలకు పైగా బోర్లు ఎండిపోయాయి. చెరువులు, రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. ప్రణాళికలు లేకుండా అర్బనైజేషన్ చేపట్టడంతోనే బెంగళూరులో తీవ్ర నీటి సంక్షోభం తలెత్తిందని ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) సైంటిస్టులు తెలిపారు. 


ఫలితంగా గుక్కెడు నీటి కోసం బెంగళూరు వాసులు అల్లాడిపోతున్నారని వివరించారు. గత కొన్నేండ్లుగా సిటీలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం రికార్డయింది. గడిచిన 50 ఏండ్లలో బెంగళూరులోని పచ్చదనం అంతా తుడిచిపెట్టుకుపోయింది. గ్రీన్ సిటీ కాస్త.. రెడ్ సిటీగా మారిపోయింది. కొన్ని దశాబ్దాలుగా సిటీలో నిర్మాణాలు భారీగా పెరిగాయి. చెట్లు నరికేసి భూమిని చదును చేయడం, కాంక్రీట్ కన్​స్ట్రక్షన్స్ 1055 శాతం పెరిగాయని ఐఐఎస్ సైంటిస్టులు తెలిపారు. దీంతో 79శాతం వాటర్ స్ప్రెడ్ ఏరియా కనుమరుగైపోయింది. దీంతో వాటర్ రీసోర్స్ సిస్టమ్ మొత్తం దెబ్బతిన్నది. వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ శాతాన్ని తగ్గించే 88% వృక్ష సంపదను గత 50 ఏండ్లలో నరికేశారు.

1973లో 68 శాతం గ్రీనరీ

1973లో బెంగళూరు సిటీలో 68.2 శాతం గ్రీనరీ ఉంటే.. 7.97 శాతం బిల్డప్ ఏరియా ఉండేది. 2002కు వచ్చేసరికి వృక్ష సంపద 38.7 శాతానికి పడిపోగా, బిల్డప్ ఏరియా 37.7 శాతానికి పెరిగిపోయింది. 2010లో 28.2 శాతం గ్రీనరీ ఉంటే.. 54.5 శాతానికి బిల్డప్ ఏరియా పెరిగింది. ఇక 2023కు వచ్చేసరికి 1973 నాటి సీన్ రివర్స్ అయింది. 2023లో గ్రీనరీ 2.90 శాతానికి పడిపోగా.. బిల్డప్ ఏరియా ఏకంగా 86.60‌‌‌‌‌‌శాతానికి పెరిగిపోయింది. 

అర్బనైజేషన్ కారణంగానే బెంగళూరులో నీటి సంక్షోభం ఏర్పడింది. రిమోట్ సెన్సింగ్ డేటా ప్రకారం.. బెంగళూరులో 15లక్షల చెట్లు మాత్రమే ఉన్నాయి. 95 లక్షల జనాభా ఉన్న సిటీలో.. ఏడుగురికి ఒక చెట్టు మాత్రమే ఉన్నది. చాలా తక్కువ కాలంలో భారీ నిర్మాణాలు, కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ, మురికివాడలు పెరగడం, నిరుద్యోగం, శిలాజ ఇంధనాలపై ఆధారపడం వంటి అంశాలు బెంగళూరును తీవ్రంగా ప్రభావితం చేశాయి. 

భారీగా తగ్గిన వాటర్ స్ప్రెడ్ ఏరియా

గత 50 ఏండ్లలో గ్రీన్ సిటీగా ఉన్న బెంగళూరు.. కాంక్రీట్ సిటీగా ఎలా మారిపోయిందన్న దానిపై ఐఐఏ సైంటిస్టులు స్టడీ చేశారు. ఎలాంటి ప్రణాళికలు లేకుండా.. ఇష్టారీతిన చేపట్టిన అర్బనైజేషన్ కారణంగా బెంగళూరుకు ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. తమ స్టడీకి సంబంధించిన డేటాను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్​లోని బెంగళూరు ఇన్ఫర్మేషన్ సిస్టమ్, బెంగళూరు లేక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్​లో ఉంచారు. ఇది పరిశోధకులు, పాలసీ మేకర్స్​కు ఉపయోగపడుతుందని వివరించారు. 

ఐఐఎస్​కు చెందిన సెంటర్ ఫర్ ఎకోలాజికల్ సైన్సెస్ ప్రొఫెసర్ టీవీ రామచంద్ర కీలక విషయాలు వెల్లడించారు. బెంగళూరులో.. 1973లో వాటర్ స్ప్రెడ్ ఏరియా 5,742 ఎకరాలు ఉంటే.. 2023 నాటికి 1,712 ఎకరాలకు తగ్గిపోయింది. అంటే.. 50 ఏండ్లలో 4,030 ఎకరాల వాటర్ స్ప్రెడ్ ఏరియా అర్బనైజేషన్​కు ఆవిరైపోయింది. దీనికితోడు 98శాతం సరస్సులు, చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. ఇందులో 90శాతం మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలతో నిండి పోయాయి. 

ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 1973లో ఐటీ సిటీలో బిల్డప్ ఏరియా కేవలం 8శాతం మాత్రమే ఉండేది. 2023 నాటికి బిల్డప్ ఏరియా 93.3 శాతానికి పెరిగిపోయింది. వాయు కాలుష్య పెరిగిపోవడంతో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు రికార్డయ్యాయి. దీంతో గ్రీనరీ మొత్తం కనిపించకుండా పోయింది.

ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రజలు 

నీటి సమస్య నుంచి గట్టెక్కేందుకు బెంగళూరువాసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోంకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నీటి సౌలత్ ఉన్న ప్రాంతానికి వెళ్లిపోవడం, రోజు తప్పించి రోజు స్నానం చేయడం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా వైట్​ఫీల్డ్, కేఆర్ పురం, ఎలక్ట్రానిక్ సిటీ, ఆర్ఆర్ నగర్, కెంగేరి, సీవీ రామన్ నగర్​లలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. అపార్ట్​మెంట్ వాసులంతా ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. 

ఏ హోటల్, రెస్టారెంట్ కు వెళ్లినా గతంలో స్టీల్ ప్లేట్లు కనిపించేవి. ఇప్పుడు వాటికి కడిగేందుకు కూడా నీళ్లు లేకపోవడంతో డిస్పోజల్ కప్పులు, గ్లాసులు, ప్లేట్లు ఉపయోగిస్తున్నారు. నీటి అవసరాన్ని, దాన్ని ఎలా కాపాడుకోవాలనేదానిపై అధికారులు కూడా అవగాహన కల్పిస్తున్నారు. స్కూల్స్, ఆఫీస్ బిల్డింగ్స్, అపార్ట్​మెంట్లపై హోర్డింగ్స్, వాల్ పెయింటింగ్స్ చేస్తున్నారు. కోచింగ్ సెంటర్లను నిర్వాహకులు మూసివేసి ఆన్​లైన్ క్లాసులు కండక్ట్ చేస్తున్నారు. 

బన్నెరఘట్ట రోడ్​లోని ఓ స్కూల్ మూతపడింది. కరోనా టైమ్ మాదిరి ఆన్​లైన్ క్లాసులకు అటెండ్ కావాల్సిందిగా మేనేజ్​మెంట్ సూచించింది. కేఆర్ పురంలోని చాలా మంది రోజు తప్పించి రోజు స్నానం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంట్లో వంట చేసేందుకు కూడా నీళ్లు లేకపోవడంతో వారంలో రెండు సార్లు బయటి నుంచి పార్సిల్ తెచ్చుకుంటున్నారు. కిరాయి ఉన్నవాళ్లకు నీటి వాడకంపై ఓనర్లు ఆంక్షలు విధించారు.

నీటి ఎద్దడి లేదు: డీకే శివకుమార్

బెంగళూరులో నీటి సంక్షోభం లేదని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. నీటి ఎద్దడి పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని వివరించారు. ఒక్క బెంగళూరు సిటీలోనే 7వేల బోర్లు ఎండిపోయాయని తెలిపారు. నీటి వనరులు గుర్తించామన్నారు. ట్యాంకర్ల సాయంతో వాటర్ సప్లై చేస్తున్నట్టు తెలిపారు. గవర్నమెంట్ నిర్ణయించిన ధరకే కొన్ని కంపెనీలు నీళ్లు సప్లై చేస్తున్నాయన్నారు. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏప్రిల్, మే నెలలను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తమిళనాడుకు నీళ్లు ఇవ్వడం లేదన్నారు.