ఆర్‌అండ్​బీలో హౌసింగ్​ విలీనానికి ఇప్పట్లో నో చాన్స్

ఆర్‌అండ్​బీలో హౌసింగ్​ విలీనానికి ఇప్పట్లో నో చాన్స్
  • కనీసం రెండేండ్లు పడుతుందంటున్న నిపుణులు
  • 9, 10వ షెడ్యూల్ లో హౌసింగ్ బోర్డు
  • భూములు మొత్తం అమ్మితేనే  హౌసింగ్ కార్పొరేషన్ క్లోజ్
  • సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్  చేయకుండా 

హైదరాబాద్, వెలుగు : ఆర్ అండ్ బీ లో హౌసింగ్ డిపార్ట్ మెంట్ విలీనం ప్రాసెస్ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. విలీన పక్రియ పూర్తవడానికి కనీసం రెండేండ్లు పడుతుందని రిటైర్డ్ అధికారులు చెబుతున్నారు. దీనికి ఎన్నో అడ్డంకులు, చిక్కుముడులు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల ఆర్ అండ్ బీలో హౌసింగ్ డిపార్ట్ మెంట్ ను విలీనం చేస్తూ సీఎస్ శాంతి కుమారి జీవో జారీ చేశారు. విలీనంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందుకు సెల్ ఏర్పాటు చేస్తామని జీవోలో పేర్కొన్నారు. అయితే ఇంత వరకు సెల్ ఏర్పాటు పై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు. హౌసింగ్ బోర్డు 9, 10వ షెడ్యూల్ లో ఉంది. రాష్ట్రంలో మొత్తం 80కి పైగా కార్పొరేషన్లు ఈ షెడ్యూల్ ఉన్నాయి. వీటి విభజనకు షీలాబేడీ కమిటీ పనిచేస్తోంది. రాష్ట్రం ఏర్పాటై ఎనిమిదేండ్లయినా ఇంత వరకు కార్పొరేషన్ల విభజన పూర్తి కాలేదు. వాటిలో హౌసింగ్ బోర్డు కూడా ఉంది. అవి పూర్తి కాకుండా ఈ ఒక్కటి ఎలా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. 

ఉద్యోగుల భర్తీకి సమస్యలు

హౌసింగ్ డిపార్ట్ మెంట్ కు అనుబంధంగా ఉన్న హౌసింగ్ బోర్డు, దిల్ లో ఉద్యోగులను ఇతర కార్పొరేషన్లు, సొసైటీల్లో సర్దుబాటు చేయాల్సి ఉంది. అందు కోసం ఆర్థిక శాఖ సూపర్ న్యూమర్ పోస్టులను క్రియేట్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని రిటైర్డ్ అధికారులు చెబుతున్నారు. సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయకుండా ఇతర కార్పొరేషన్లు, సొసైటీల్లో హౌసింగ్  శాఖ అధికారులు, ఉద్యోగులను భర్తీ చేస్తే అక్కడి వాళ్ల సీనియారిటీ, ప్రమోషన్లకు ఆటంకం కలుగుతుందని, దీంతో వారు హైకోర్టును ఆశ్రయించవచ్చని వ్యాఖ్యానిస్తున్నారు. 

బోర్డు విలీనం ఎట్ల?

రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ బోర్డు పరిధిలో సుమారు రూ.50 వేల కోట్ల విలువైన భూములు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు నుంచి హౌసింగ్ బోర్డును ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, చిన్నచూపు చూస్తోందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. బోర్డును రద్దు చేయాలంటే అసెంబ్లీలో బిల్ పాస్ చేయాల్సి ఉంటుందని పలువురు రిటైర్ట్ అధికారులు చెబుతుండగా, మరి కొంతమంది మాత్రం అవసరం లేదని చెబుతున్నారు. నాంపల్లి లో గగన్ విహార్, గృహకల్ప, చంద్ర విహార్, ఓల్డ్ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో 10 ఫ్లోర్లకు పైగా భారీ కమర్షియల్ కాంప్లెక్స్ లు హౌసింగ్  బోర్డు పరిధిలో ఉన్నాయి. వాటి నుంచి  బోర్డుకు పెద్ద మొత్తంలో రెవెన్యూ వస్తోంది.  త్వరలో బోర్డు ఆస్తులు, భూముల వివరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. 

కబ్జాలు స్టార్ట్ 

ఆర్ అండ్ బీ లో హౌసింగ్ డిపార్ట్‌‌ మెంట్ విలీనంపై  గత కొన్ని నెలలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం జీవో ఇవ్వడంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. కూకట్ పల్లిలో హౌసింగ్ బోర్డుకు 70 ఎకరాలు ఉండగా, పక్కన ఓ ప్లాట్ ఓనర్ హౌసింగ్ బోర్డుకు చెందిన కొంత భూమిని కబ్జా చేశారని అధికారులు అంటున్నారు. ఈ ప్రాంతంలో గజం లక్షన్నర వరకు ఉందని తెలుస్తోంది.