పెండ్లి ఆగిపోయినా, వాయిదా పడినా డబ్బు తిరిగొస్తుంది

పెండ్లి ఆగిపోయినా, వాయిదా పడినా డబ్బు తిరిగొస్తుంది

కొత్తగా బండి కొన్నా, కారు కొన్నా, లేదా రెస్టారెంట్ పెట్టినా ఇన్స్యూరెన్స్​ ఉండాల్సిందే. ఇంట్లోవాళ్ల ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి. మరి జీవితంలో చాలా ముఖ్యమైన పెండ్లికి ఇన్స్యూరెన్స్ లేకుంటే ఎట్లా?. పెండ్లికి ఇన్షూరెన్స్​ ఏంటి? అని ఆశ్చర్యపోకండి. ఈమధ్య చాలామంది వెడ్డింగ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారు.   స్టాటిటిక్స్​ ప్రకారం... ఎంత లేదన్నా పెండ్లికి  300 నుంచి 2000 మంది దాకా వస్తారు.  అందరికీ భోజనాలు, ఇతర ఏర్పాట్ల కోసం  రూ. 20 లక్షల నుంచి 5 కోట్ల రూపాయల వరకు ఖర్చుచేసేవాళ్లు ఉన్నారు. అయితే...  కరోనా మొదలయ్యాక చాలామంది పెండ్లి వాయిదా వేసుకున్నారు.

వాళ్లలో అప్పటికే పెండ్లికి ఏర్పాట్లు అన్నీ చేసుకున్నవాళ్లూ ఉన్నారు.  దాంతో కొందరు లక్షల్లో నష్టపోయారు. ఇలాంటి సమస్య రావద్దనే ఈమధ్య చాలామంది వెడ్డింగ్ ఇన్స్యూరెన్స్ తీసుకుంటున్నారు. అందుకు కారణం...  పెండ్లికి పది రోజుల ముందే  ఫంక్షన్​ హాల్, డీజె, ఫొటోవాళ్లు, హోటల్ రూమ్ బుకింగ్.. ఇలా అన్నింటికీ అడ్వాన్స్ ఇస్తారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల పెండ్లి ఆగిపోయినా, వాయిదా పడినా ఆ డబ్బు తిరిగొస్తుందనే నమ్మకం లేదు. అదే.. వెడ్డింగ్ ఇన్స్యూరెన్స్​ చేయిస్తే డబ్బు పోతుందనే భయం అక్కర్లేదు.

మనదేశంలో...

క్యాటరింగ్ వాళ్లు, డెకరేషన్​ వాళ్లు టైంకి రాలేదనుకోండి. అడ్వాన్స్ మాట సరే.. మళ్లీ వేరేవాళ్లని మాట్లాడాలి. దాంతో అదనపు ఖర్చవుతుంది. అలాంటప్పుడు వెడ్డింగ్ ఇన్స్యూరెన్స్ఉంటే వాళ్ల దగ్గర డిపాజిట్ చేసిన మొత్తం తిరిగొస్తుంది.  మనదేశంలో ఐసిఐసిఐ లంబార్డ్, బజాజ్ ఫిన్​సర్వ్, బ్యాంక్​బజార్, పైసా బజార్ వంటి కంపెనీలు వెడ్డింగ్ ఇన్స్యూరెన్స్​ అందిస్తున్నాయి. అయితే ఇవి రెండేండ్లకు వెడ్డింగ్ ఇన్స్యూరెన్స్​ ఇస్తాయి. ఈ లెక్కన పెండ్లికి రెండేండ్లకు ముందే ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చన్నమాట.