UPI News: యూపీఐ యూజర్లకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి NPCI కొత్త ఆంక్షలు..!

UPI News: యూపీఐ యూజర్లకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి NPCI కొత్త ఆంక్షలు..!

UPI New Restrictions: భారతదేశంలోని చెల్లింపు వ్యవస్థను పూర్తిగా మార్చేసిన టెక్నాలజీ యూపీఐ చెల్లింపులు. వాస్తవానికి దీని ద్వారా దేశంలో భౌతికంగా డబ్బు వినియోగాన్ని తగ్గించాలనే ప్రభుత్వ లక్ష్యం వేగంగా నెరవేరుతోంది. ఎందుకంటే ప్రస్తుతం దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ విరివిగా ఉపయోగించబడుతోంది. ప్రజలకు ఇంత చేరువైన యూపీఐపై కొన్ని కొత్త ఆంక్షలు అమలులోకి రాబోతున్నట్లు సీఎన్బీసీ న్యూస్-18 నివేదించింది.

వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 1, 2025 నుంచి యూపీఐ పెద్ద మార్పులకు గురవుతోందని తెలుస్తోంది. యూపీఐ వ్యవస్థను నియంత్రించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ కొత్త ఏపీఐ రూల్స్ అన్ని బ్యాంకులు, పేమెంట్స్ యాప్స్ కోసం అమలులోకి తీసుకురాబోతోందని తెలుస్తోంది. ఇవి ప్రస్తుతం ఉన్న చెల్లింపు వ్యవస్థలను మరింత సురక్షితమైనవిగా మార్చేందుకు తీసుకొస్తున్నారు. అయితే దీనివల్ల వినియోగదారులపై కొన్ని ఆంక్షలు కూడా చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

1. NPCI తీసుకొస్తున్న కొత్త నిబంధనల కింద వినియోగదారులు ఒక యూపీఐ చెల్లింపు యాప్ లో తమ అకౌంట్ బ్యాలెన్స్ రోజుకు 50 సార్లు మాత్రమే చెక్ చేసుకోవటానికి వీలు కల్పించబడనుంది. పరిమితి దాటిన తర్వాత యూజర్లు ప్రయత్నించినప్పటికీ యాప్ రిక్వెస్ట్ పై స్పందించదు.

2. ఒకవేళ ఏదైనా టెక్నికల్ కారణం లేదా ఇంటర్నెట్ సమస్యల వల్ల చెల్లింపు మధ్యలో నిలిచి పెండింగ్ లో పడితే వెంటవెంటనే దాని స్టేటస్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించటం కుదరదని తెలుస్తోంది. చెల్లింపు వ్యవస్థపై లోడ్ భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

3. యూజర్లు తమ యూపీఐ పేమెంట్ యాప్ లో ఎన్ని బ్యాంక్ ఖాతాలు లింక్ చేయబడ్డాయనే వివరాలను ఇకపై రోజుకు గరిష్ఠంగా 25 సార్లు చెక్ చేసుకునేందుకు మాత్రమే వీలుండనుంది. 

4. అలాగే దేశంలోని ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ యాప్స్ అలాగే బ్యాంకులు తమ ఏపీఐ వినియోగాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. వీటిలో ఏవైనా తప్పిదాలు ఉంటే పెనాల్టీలతో పాటు ఆంక్షలు, బ్యాన్ వంటి కఠిన చర్యలు ఉంటాయని ఎన్పీసీఐ వెల్లడించింది. అలాగే తమ సిస్టమ్ ఆడిట్ వివరాలను ఆగస్టు 31నాటికి అందించాలని కూడా సూచించింది. 

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ చెల్లింపు పర్యావణ వ్యవస్థలో మరింత స్టెబిలిటీని తీసుకొచ్చే ఉద్దేశంతోనే పైన పేర్కొన్న ఆంక్షల అమలుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చర్యలు యూజర్లకు మెరుగైన పేమెంట్ చెల్లింపు అనుభూతితో పాటు రక్షణను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.