
- ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి
హనుమకొండ, వెలుగు : భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అంతరాయాలు తలెత్తితే వెంటనే సరఫరా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఆదేశించారు. అవసరమైన మెన్ , మెటీరియల్ సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రతి సబ్ స్టేషన్ కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని సూచించారు. ట్రాన్స్ ఫార్మర్ల రిపేర్లకు కొత్తగా ఎస్పీఎం షెడ్లు ఏర్పాటు చేశామని, ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.
హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్ నుంచి బుధవారం ఎన్పీడీసీఎల్ పరిధిలోని డైరెక్టర్లు, సీఈలు, నోడల్ జీఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. విద్యుత్ బకాయిలు వంద శాతం వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. బిల్లులు చెల్లించని సర్వీసులపై ఫోకస్ పెట్టాలని, కాలిపోయిన, పని చేయని మీటర్లను వెంటనే మార్చాలని సూచించారు.
హెచ్టీ సర్వీసులను తనిఖీ చేయాలని , ఇంకా మాన్యువల్ ద్వారా రీడింగ్ తీసుకునే మీటర్లను వెంటనే మార్చాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డైరెక్టర్లు వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, వి.మోహన్ రావు, సి. ప్రభాకర్ ,సీఈలు టి.సదర్ లాల్, బి.అశోక్ కుమార్, కె.తిరుమల్ రావు, రాజుచౌహన్, అశోక్, రవీంద్రనాథ్, ఆర్.చరణ్ దాస్, మాధవ రావు, వెంకటరమణ ఉన్నారు.