
జైనూర్, వెలుగు: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తమకు మూడు నెలలుగా జీతాలు చెల్లించలేదని ఫీల్డ్ అసిస్టెంట్లు బుధవారం జైనూర్ ఎంపీడీవో ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేశారు. అధికారులతో ప్రతి వారం నిర్వహించే సమీక్షా సమావేశాన్ని బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఎంపీవో మోహన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.
ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఆత్రం రాజు, ఆత్రం రవీందర్ మాట్లాడుతూ.. నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం వల్ల కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉపాధి హామీ కూలీలకు పని కల్పించడం సాధ్యంకావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బకాయిలను తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ లీడర్లు జాదవ్ సుభాష్, జాదవ్ పండిత్, మెస్రం మనోహర్, దుర్వ అంబాజీరరావు తదితరులున్నారు.