గ్రీన్‌‌ ఎనర్జీ రంగంలో 80 వేల కోట్లు..రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎన్టీపీసీ 

గ్రీన్‌‌ ఎనర్జీ రంగంలో 80 వేల కోట్లు..రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన ఎన్టీపీసీ 
  • సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ సీఎండీ, ప్రతినిధుల భేటీ 
  • సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చ
  • డ్యామ్‌‌లు, రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు 
  • 6,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం  
  • ఎన్టీపీసీ ప్రతిపాదనలను స్వాగతించిన సీఎం 
  • అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ 
  • ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గ్రీన్‌‌‌‌ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ముందుకొచ్చింది. సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు రూ.80 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడించింది. శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌‌‌లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల్లో రూ.80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎంకు ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్​సింగ్ తెలిపారు. 

రాష్ట్రంలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ద్వారా 6,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని గురుదీప్ ​సింగ్ చెప్పారు. వీటి ఏర్పాటుకు డ్యామ్‌‌‌‌లు, రిజర్వాయర్లు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల ద్వారా భూమి వినియోగం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు నీటి ఆవిరి నష్టాలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు.  

ప్రభుత్వం నుంచి సహకారంఅందిస్తాం: సీఎం 

ఎన్టీపీసీ ప్రతిపాదనలను తాము స్వాగతిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సంస్థకు అన్ని విధాలా సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రం విద్యుత్ రంగంలో స్వావలంబన సాధించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధికి ఈ పెట్టుబడులు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు, ఫ్యూచర్​సిటీ ఏర్పాటుతో పాటు పెరుగుతున్న జనాభా, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల విస్తరణ కారణంగా విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్నది.

ప్రస్తుతం థర్మల్, జల విద్యుత్ కేంద్రాలపైనే తెలంగాణ ఆధారపడుతున్నప్పటికీ.. గ్రీన్​ఎనర్జీ వనరులైన సోలార్, విండ్ పవర్‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహిస్తున్నం. తద్వారా కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ అనుకూల గ్రీన్​ఎనర్జీ ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని తెలిపారు. కాగా, ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో గ్రీన్​ఎనర్జీ రంగంలో ఎన్టీపీసీ అగ్రగామిగా నిలువనుంది. ఈ ప్రాజెక్టులు విజయవంతమైతే రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా.. దేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక శక్తి కేంద్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ఇంధన శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్టీపీసీ ప్రతిపాదన ఇంధన రంగంలో కొత్త ఒరవడిని సృష్టించే దిశగా కీలక ముందడుగు అని చెప్పాయి.

మరిన్ని వార్తలు