
‘హడకమత్సూరి’లో ‘లక్కీ’ షింగీ కట్టెల కోసం యువకుల పోటాపోటీ
ఏటా ఫిబ్రవరిలో నిర్వహణ
జపాన్‌లో ఏటా ఒక డిఫరెంట్ ఫెస్టివల్ జరుపుకుంటరు. ఫిబ్రవరి మూడో శనివారం నాడు ‘నగ్న (నేకెడ్)’ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటారు. దీనికిఎంతో క్రేజ్ ఉంటుంది. వేలాది మంది ఇందులో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. స్థానికంగా ‘‘హడక మత్సూరీ” అని పిలిచే ఈ ఫెస్టివల్ ఒకయామా పరిధి హోన్షు ఐలాండ్ లోని సైదైజీ కన్నోనియాన్ టెంపుల్లో జరుగుతుంది. అసలేంటీ ఫెస్టివల్ అంటే… వేలాది మంది పురుషులు బట్టలు లేకుండా ఇందులో పాల్గొంటారు. కేవలం బుడ్డగోసి కట్టుకొని, కాళ్లకు రెండు సాక్సులు వేసుకొని చల్లని నీటిలో దేవాలయం చుట్టూ తిరుగుతుంటారు. ఇలా గంటసేపు చేస్తారు. రాత్రి 10 గంటలకు లైట్లు వెలగగానే పూజారి 100 బండిళ్ల చెట్ల కొమ్మలు, ఒక రెండు లక్కీ షింగీ కట్టెలను ఆ జనంలోకి విసురుతారు. అప్పుడే అసలైన ఈవెంట్ మొదలవుతుంది. ఈ కొమ్మలు, కట్టెల కోసం యువకులంతా పోటీ పడతారు. ఒకరినొకరు తోసుకుంటూ, తొక్కుకుంటూ వాటి కోసం ఎగబడతారు. కొంతమందికి దెబ్బలు కూడా తగులుతుంటయి. కాళ్లు, చేతులు కూడా ఇరుగుతుంటాయి. అసలిదంతా ఎందుకంటే… ఆ కొమ్మలు, కట్టెలు దొరికితే ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. పంటలు బాగా పండాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, సంతాన భాగ్యం కలగాలని ఈ ఫెస్టివల్ నిర్వహిస్తుంలారు. ఈ ఫెస్టివల్‌ను చూసేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తుంటారు. జపాన్ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి టూరిస్టులు కూడా వస్తుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఉత్సవంలో దాదాపు 10 వేల మందికి పైగా పురుషులు పాల్గొన్నరు. ఈ ఫెస్టివల్లో విదేశీయులు కూడా పాల్గొనవచ్చు. ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకొని లేదా డైరెక్టుగానూ ఇందులో పాలుపంచుకోవచ్చు.
ఇదీ చరిత్ర
ఈ ఫెస్టివల్‌కు 500 ఏండ్ల చరిత్ర ఉంది. 1338–1573 మధ్య పాలించిన మురోమచి కాలంలో ప్రారంభమైంది. సైదైజీ కన్నోనియన్ టెంపుల్లో పూజారి ఇచ్చే తాలిస్మన్ (తాయతు లాంటిది) పేపర్ల కోసం గ్రామస్తులు పోటీ పడేవారు. ఆ పేపరు దొరికితే మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. దీని గురించి ఒకరి నుంచి ఒకరికి తెలియడంతో జనం ఎక్కువగా రావడం మొదలైంది. ఇక అదొక పెద్ద ఉత్సవంగా చేయడం ప్రారంభించారు. అయితే జనం ఎక్కువగా రావడంతో పూజారి ఇచ్చే పేపర్లను అందుకునే క్రమంలో అవి చినిగిపోవడం… అంతేకాకుండా జనం ఒకరినొకరు తోసుకోవడంతో, తొక్కుకోవడంతో వారి బట్టలూ చినిగిపోయేవి. దీంతో పేపర్ ప్లేస్‌లో కట్టెలు, కొమ్మలు ఇవ్వడం ప్రారంభించారు. అలాగే ఈ ఈవెంట్లో బట్టలు లేకుండా పాల్గొనాలనే నిబంధన పెట్టారు. అలా ఇది ‘నేకెడ్ ఫెస్టివల్’గా మారింది. 2016లో దీన్ని జానపద సంస్కృతి సంపదగా గుర్తించారు. జపాన్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ నేకెడ్ ఫెస్టివల్నునిర్వహిస్తారు. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతిలో జరుగుతుంది.