నుమాయిష్​కు మాస్క్ మస్ట్

నుమాయిష్​కు మాస్క్ మస్ట్
  •     నుమాయిష్​కు మాస్క్ మస్ట్
  •     జనవరి 1న సీఎం ప్రారంభిస్తారు: శ్రీధర్ బాబు
  •     అన్ని ఏర్పాట్లు చేశామన్న ఎగ్జిబిషన్ అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి

 
జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు  నిర్వహించే నుమాయిష్  కోసం అన్ని ఏర్పాట్లు చేశామని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కరోనా ప్రభావం ఉన్నందున  సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని కోరారు.

బషీర్​బాగ్, వెలుగు: నుమాయిష్ ను గతం కంటే అట్టహాసంగా నిర్వహిస్తామని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. జనవరి 1 నుంచి హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్- 2024) సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఎనిమిది దశాబ్దాలుగా తెలంగాణకు నుమాయిష్ తలమానికంగా ఉందని మంత్రి కొనియాడారు. 

ఈ సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సత్యేందర్ వనం, కార్యదర్శి హనుమంతరావుతో కలిసి శ్రీధర్ బాబు మాట్లాడారు. నుమాయిష్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జనవరి 1 నుండి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ ను లక్షలాది మంది సందర్శిస్తారని చెప్పారు. ఈసారి 2500 వరకు స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రదర్శనలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న వ్యాపారులు పాల్గొంటారని వివరించారు. కరోనా ప్రభావం ఉన్నందున ప్రదర్శనకు వచ్చే సందర్శకులు విధిగా మాస్కులు ధరించాలని కోరారు.

 నిజాం కాలం నుంచి ఈ ప్రదర్శన కొనసాగుతుదన్నారు. సేవా దృక్పథంతో సొసైటీ సభ్యులు పనిచేస్తున్నారని మంత్రి వెల్లడించారు. తనను సొసైటీ ప్రెసిడెంట్​గా ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఫైర్, హెల్త్, శానిటేషన్ విషయంలో సొసైటీ జాగ్రత్తలు తీసుకుందన్నారు. ప్రదర్శనతో వచ్చే ఆదాయంతో 20కి పైగా విద్యాసంస్థలు నడుస్తున్నాయని.. 30వేల మంది మహిళలకు విద్య అందుతుందన్నారు. మెట్రో రైలు కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.