చైనాలో మహమ్మారి కరోనా వైరస్ నుంచి బాధితుల్ని కాపాడేందుకు డాక్టర్లు, నర్సులు అహర్నిశలు కష్టపడుతున్నారు. అవిశ్రాంత సేవలో ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా రోజులు తరబడి ఆస్పత్రిలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. తమను చూసేందుకు ఆస్పత్రికి వస్తున్న కుటుంబసభ్యుల్ని కలవడం లేదు. దీంతో చైనాలో పరిస్థితి ఎలా ఉందో ప్రభుత్వ మీడియా సంస్థ జిన్హువా కళ్లకు కట్టినట్లు చూపెడుతోంది. ప్రస్తుతం జిన్హువా విడుదల చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
చైనా హెనాన్ ప్రావిన్స్ ఫుగౌ కౌంటీ పీపుల్స్ ఆస్పత్రిలో లియు హైయాన్ నర్సుగా పనిచేస్తుంది. ఇంటికి వెళ్లకుండా ఆ ఆస్పత్రిలో ఉంటూ కరోనా వైరస్ బాధితులకు సేవ చేస్తుంది. అయితే తల్లి ఇంటికి రాకపోవడంతో లియు కూతురు చెంగ్ షివెన్ (9) ఆస్పత్రికి వచ్చింది. వస్తూ వస్తూ తల్లి కోసం ఓ లంచ్ బాక్స్ తీసుకొచ్చింది.
అయితే కరోనా వ్యాధి సోకుతుందనే ఉద్దేశంతో ఆస్పత్రి యాజమాన్యం కూతుర్ని కలిసేందుకు ఒప్పుకోలేదు. దీంతో తల్లి కూతుళ్లు దూరం నుంచే సైగలతో మాట్లాడుకున్నారు. గాల్లోనే హగ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తల్లి కూతురు మధ్య జరిగిన సంబాషణ ఇలా ఉంది.
కూతురు – తల్లిని చూసిన ఆనందంలో బరువెక్కిన హృదయంతో గాల్లో హగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ
తల్లి – తనపై కూతురు చూపిస్తున్న ప్రేమకు ముగ్ధురాలై గాల్లో కూతురుకు హగ్ ఇస్తూ
కూతురు – అమ్మా
తల్లి – జాగ్రత్తగా ఉండు
కూతురు – నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానమ్మ
తల్లి – మీ అమ్మ రాక్షసులతో పోరాటం చేస్తుంది. వైరస్ తగ్గిపోతే నేను ఇంటికి వస్తా
{ వైరస్ సోకుతుందని తల్లి కూతుళ్లని కలవనీయ్యలేదు. దీంతో ఆ తల్లి పొంగుకొస్తున్న దుఃఖాన్ని కంటి రెప్పల మాటున అతికష్టమ్మీద తన పెదవి కింద అదిమి పెట్టి కూతురికి టాటా చెప్పింది }
కూతురు – తల్లి బైబై చెప్పడంతో తనవెంట తెచ్చిన అన్నం బాక్స్ ను అల్లంత దూరంలో పెట్టింది.
తల్లి – కూతురు పెట్టిన అన్నం బాక్స్ ను తీసుకొని కరోనావైరస్ ను హతమార్చేందుకు ఆవేశంగా కదిలింది.
