హెచ్1బీ వీసాల ఖర్చు ఎంతైనా ఓకే.. ఇండియా టెకీలను రప్పిస్తం: ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌‌

హెచ్1బీ వీసాల ఖర్చు ఎంతైనా ఓకే.. ఇండియా టెకీలను రప్పిస్తం: ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌‌

న్యూఢిల్లీ: హెచ్‌‌1 బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెరిగినా, ఇండియా, ఇతర దేశాల నుంచి టెక్‌‌ ట్యాలెంట్‌‌ను తెచ్చుకోవడం ఆపబోమని చిప్‌‌ల తయారీ కంపెనీ ఎన్విడియా  సీఈఓ  జెన్సెన్ హువాంగ్  ప్రకటించారు.  తమ కంపెనీ హెచ్‌‌1బీ వీసాల స్పాన్సర్‌‌షిప్ కొనసాగిస్తుందని, ఖర్చులన్నీ భరిస్తుందని అన్నారు.   గ్లోబల్ వర్క్‌‌ఫోర్స్‌‌పై తమకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని తెలిపారు.

కొత్త హెచ్‌‌1బీ వీసా దరఖాస్తులపై కంపెనీలు లక్ష డాలర్ల అదనపు ఫీజు చెల్లించాలని తాజాగా ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో  ఇండియా, చైనా వంటి దేశాల నుంచి వచ్చిన టెక్ ఉద్యోగుల్లో భయాందోళనలు పెరిగాయి.  “నేను కూడా ఎన్విడియాలోని అనేక మంది ఇమిగ్రెంట్లలో ఒకడిని. అమెరికాలో దొరికిన అవకాశాలు నా జీవితాన్ని మార్చాయి” అని హువాంగ్ పేర్కొన్నారు.

ఎన్విడియా విజయంలో వివిధ దేశాల నుంచి  వచ్చిన ప్రతిభావంతుల భాగస్వామ్యం కీలకంగా ఉందన్నారు.  “ఎన్విడియా అనే అద్భుతం..మీ అందరి వల్లే సాధ్యమైంది” అని ఆయన వ్యాఖ్యానించారు.  కాగా, హెచ్‌‌1బీ వీసా సాయంతో అమెరికాలోని కంపెనీలు ఇతర దేశాల నుంచి ట్యాలెంట్‌‌ను యూఎస్‌‌కి తెప్పించుకోవచ్చు.  ముఖ్యంగా కాలిఫోర్నియా, సిలికాన్ వ్యాలీ వంటి ప్రాంతాల్లో హెచ్‌‌1బీ వీసాలపై ఆధారపడే కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి.   టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో అమెరికా టాప్‌‌లో కొనసాగాలంటే హెచ్‌‌1బీపై వచ్చే లీగల్ ఇమిగ్రెంట్స్  అవసరమని హువాంగ్ అభిప్రాయపడ్డారు.