
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ టెక్ బ్రాండ్ ఆల్కాటెల్ ఫోన్ల తయారీ కోసం నెక్ట్స్‌సెల్ ఇండియా... డిక్సన్ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆల్కాటెల్ ఏటా 1.2 మిలియన్ స్మార్ట్‌ఫోన్లను తయారు చేయాలని భావిస్తోందని నెక్ట్స్‌సెల్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అతుల్ వివేక్ తెలిపారు. మొదట ఫోన్లను తయారు చేస్తామని, తదనంతరం ఇతర ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై దృష్టి పెడతామని వివేక్ వెల్లడించారు. రాబోయే 8-–10 వారాల్లో భారత్తయారీ ఆల్కాటెల్ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ విడుదల చేయాలని కోరుకుంటోందని ఆయన తెలిపారు.
అల్కాటెల్ ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ మొబైల్ ఫోన్ మార్కెట్‌లో తిరిగి వస్తోంది. రీఎంట్రీ కోసం నెక్ట్స్‌సెల్ ఇండియా 30 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 260 కోట్లు) పెట్టుబడి పెట్టింది. రూ. 20వేలు–-రూ. 25వేల ధరల విభాగంలో భారీ అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. స్టైలస్‌తో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనుంది. ఇతర బ్రాండ్లు రూ. 80వేల కంటే ఎక్కువ ధరల విభాగంలో స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే స్టైలస్లను ఇస్తున్నాయని నెక్ట్స్‌సెల్ తెలిపింది.
స్మార్ట్‌ఫోన్‌లను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి ఆల్కాటెల్ ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్‌లో అసెంబ్లీ లైన్ కోసం 500 మంది పనిచేస్తారని, వీరిలో 200 మంది ప్రత్యేకంగా ఆల్కాటెల్ పరికరాలనే తయారు చేస్తారని నెక్ట్స్‌సెల్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అంశ్ రతి తెలిపారు.