బెంగాల్​లో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు

బెంగాల్​లో 2010 నుంచి జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు
  • కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
  • అవన్నీ చట్టవిరుద్ధంగా జారీ చేశారని కామెంట్
  • ఓబీసీ కొత్త లిస్టు ప్రిపేర్ చేయాలని బెంగాల్​ సర్కార్​కు ఆదేశం
  • తీర్పుపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ సీరియస్.. జడ్జ్​మెంట్ బీజేపీ ఆర్డర్ అని ఆరోపణ

కోల్​కతా: బెంగాల్ లో 2010 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం జారీచేసిన ఓబీసీ సర్టిఫికెట్లు అన్నీ అక్రమమని, వాటన్నింటిని రద్దు చేస్తున్నామని కలకత్తా హైకోర్టు ప్రకటించింది. జస్టిస్ తాపబ్రాతా చక్రవర్తి, జస్టిస్  రాజశేఖర్  మంతాతో కూడిన బెంచ్  ఈ తీర్పు ఇచ్చింది. అయితే, ఇప్పటికే ఈ సర్టిఫికెట్ల ద్వారా ప్రయోజనం పొందిన వారిపై తాజా తీర్పు ప్రభావం ఉండబోదని కోర్టు స్పష్టం చేసింది. అంటే.. ఓబీసీ సర్టిఫికెట్ ద్వారా ఆ కోటాలో ఉద్యోగం పొందిన వారిపై, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ కోటాలో సీట్లు పొందిన వారిపై ప్రభావం చూపదని చెప్పింది.

గతంలో జారీ చేసిన సర్టిఫికెట్లు..

2010 నుంచి ఓబీసీ సర్టిఫికెట్లను చట్టవిరుద్ధంగా ఇష్యూ చేశారంటూ దాఖలైన పిల్​పై బెంచ్  విచారణ చేపట్టింది. ఓబీసీలలో గతంలో ఉన్న కులాలకు అదనంగా 2012లో మరికొన్ని సామాజిక వర్గాలను బెంగాల్ ప్రభుత్వం చేర్చిందని పిటిషనర్​ లాయర్​ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. బుధవారం ఈ కేసులో తీర్పు వెలువరించింది.  

2010 నుంచి బెంగాల్ సర్కారు జారీచేసిన ఓబీసీ సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. బెంగాల్  వెనుకబడిన తరగతుల చట్టం 2012లో సెక్షన్ 2హెచ్ 5, 6, సెక్షన్ 16, షెడ్యూల్ 1, 2 రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. 2010కు ముందు ఓబీసీల్లోని 66 తరగతులను వర్గీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్​ను తాము టచ్ చేయడంలేదని, పిటిషన్ దారు కూడా ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేయలేదని బెంచ్ తెలిపింది.

వెనుకబడిన తరగతుల చట్టం 1993 వెస్ట్  బెంగాల్  కమిషన్  ప్రకారం తాజాగా ఓబీసీ కొత్త జాబితాను ప్రిపేర్  చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బెంచ్  ఆదేశించింది. అలాగే  2010కు ముందు జారీచేసిన ఓబీసీ సర్టిఫికెట్లకు తాజా తీర్పు వర్తించదని, ఎప్పట్లానే అవి చెల్లుబాటు అవుతాయని కోర్టు పేర్కొంది.