స్కూల్‌ పిల్లల్లో ఒబెసిటీ సమస్య

స్కూల్‌ పిల్లల్లో ఒబెసిటీ సమస్య

ఆహారపు అలవాట్లు,
ఆటలు లేకపోవడమే కారణం
పోషకాహారం
ఇవ్వాలంటున్న నిపుణులు

నగరంలో 25శాతం మంది స్కూల్‌ పిల్లలు ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్నారని ‘నిమ్స్’​ బృందం జరిపిన సర్వేలో వెల్లడైంది. 9 నుంచి 15 ఏండ్ల మధ్య వయసున్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని నివేదికలో పేర్కొన్నారు. క్యాలరీలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం.. టైం పాటించకపోవడం, అధికంగా తినడం వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బ తింటోంది. 90 శాతం స్కూళ్లలో ప్లే గ్రౌండ్స్​ లేకపోవడంతో ఆటలు ఆడడం లేదు. శారీరక శ్రమ లేక బరువు పెరుగుతున్నారు. ఒకప్పుడు పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా, ఆరోగ్యంగా ఉన్నారని అనుకునే వారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కరెక్ట్​ కాదంటున్నారు డాక్టర్లు. ఫిజికల్​ యాక్టివిటీస్​తో పాటు స్కూల్​, ఇంటిపనుల్లో భాగస్వాములను చేయాలంటున్నారు.

హైదరాబాద్‍, వెలుగు: మన పిల్లలను మనమే అనారోగ్యానికి గురిచేస్తున్నామా..? అతి గారాబమే వారికి చెడు చేస్తోందా.? అనే ప్రశ్నలకు అవుననే చెబుతుననారు డాక్టర్లు. స్టూడెంట్స్ లో పౌష్టికాహార లోపా లు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్​లోని విద్యార్థుల్లో 25శాతం మంది ఒబెసిటీ సమస్య ఎదుర్కొంటున్నట్టు నిజాం ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ మెడికల్‍ సైన్సెస్‍ (నిమ్స్) ఆధ్వర్యంలో ఈమధ్య జరిపిన సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా 9 నుంచి 15 ఏండ్ల మధ్య వయస్సు విద్యార్థుల్లో ఒబెసిటీ సమస్యలు అధికంగా ఉన్నట్టు తేల్చారు. మొత్తంగా 36 శాతం మంది స్టూడెంట్స్ అధిక బరువు సమస్యను ఫేస్‍ చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‍ స్కూళ్లలో చదువుతున్న  సుమారు 500  మంది విద్యార్థులను సర్వే చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇండియన్‍ జర్నల్‍ ఆఫ్‍ ఎండోక్రైనాలజీ, మెటబాలిజంలో సర్వే నివేదిక ప్రచురితమైందని నేషనల్‍ ఇన్‍స్టిట్యూట్‍ ఆఫ్‍ నూట్రిషన్‍(ఎన్‍ఐఎన్‍) న్యూట్రిషన్‍ స్పెషలిస్ట్ డాక్టర్‍ ఎ.లక్ష్మయ్య చెప్పారు. రోజులో గంటపాటు ఫిజికల్‍ యాక్టివిటీ ఉంటే ఒబెసిటీ సమస్యలు తలెత్వవని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

లంచ్‍ బాక్స్లో

పేరెంట్స్ అతి గారాబం విద్యార్థుల ఆరోగ్యాన్ని  దెబ్బతీస్తోందని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. లంచ్‍ బాక్స్​ల్లో చపాతీలు, అన్నం, ఫ్రూట్స్ లాంటివి ఉండాల్సిన చోట చిప్స్, బర్గర్లు, రెడీమేడ్‍ ఫుడ్‍ కనిపిస్తోంది. 20 నుంచి 30 శాతం మంది విద్యార్థులు తమ లంచ్‍ బాక్స్ లో, బ్యాగ్‍లో ఇలాంటివే కనిపిస్తున్నట్లు  ప్రైవేట్‍ స్కూల్‍టీచర్​ అనుపమ చెప్పారు. పేరెంట్స్ ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం.. ఇంట్లో ఫుడ్‍ ప్రిపేర్‍ చేసే టైం లేకపోవడంతో అప్పటికప్పడు దొరికే జంక్‍ ఫుడ్‍ని ప్రిపేర్​ చేస్తున్నారని మరో టీచర్‍ రుక్మిణి అభిప్రాయపడ్డారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూల్స్ లోనే గడిపే స్టూడెంట్స్ ఎక్కువగా కూర్చొని ఉండటం కూడా కారణంగా తెలుస్తోంది. లంచ్‍ తర్వాత స్నాక్స్ టైంకు చాలా గ్యాప్‍ ఉండటం, ఇంటికి వెళ్లగానే ఏదో ఒకటి తినేందుకు పిల్లలు ఆసక్తి చూపడంతో గప్‍చుప్‍, కట్లిజ్‍, చిప్స్, బర్గర్లు తినిపిస్తున్నారని న్యూట్రిషన్లు చెబుతున్నారు. బయటి ఫుడ్‍ను తగ్గించాలని, పిల్లలు అడిగిందల్లా ఇప్పిస్తూ ఉంటే వారి ఆరోగ్యమే పాడవుతుందని చెబుతున్నారు.

గ్రౌండ్స్ లేవ్‍.. ఆటలు లేవ్‍

గ్రౌండ్స్​ లేక స్టూడెంట్స్ ఆటలకు దూరం అవుతున్నారు. నగరంలో సుమారు 2300 ప్రైవేట్‍ స్కూల్స్ లో  దాదాపు 3.50 లక్షల మంది చదువుతున్నారు. వీటిలో దాదాపు 90 శాతం స్కూల్స్ లో సరైన ప్లే గ్రౌండ్స్ లేవు. శివారులోని కొన్ని కార్పొరేట్‍ స్కూల్స్, నగరం మధ్యలో ఉన్న మిషినరీ స్కూల్స్ లో మాత్రమే ప్లే గ్రౌండ్స్ ఉన్నట్లు జిల్లా ఎడ్యుకేషన్‍ ఆఫీసర్లు తెలిపారు. ప్లే గ్రౌండ్స్ అందుబాటులో ఉన్నా  రోజులో అన్ని తరగతుల వారికి గేమ్స్ అడించేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. పైగా దాదాపు 3 వేల నుంచి 4 వేల మంది విద్యార్థులున్న స్కూళ్లలో ఒకరిద్దరు  పీఈటీలతోనే పని కానిచ్చేస్తున్నారు. దీంతో అన్ని తరగతుల వారికి ఒకే రోజు గేమ్స్ ఆడే అవకాశం లేకుండా పోతుంది. ఒక్కో తరగతి స్టూడెంట్స్ వారంలో రెండు సార్లు మాత్రమే ఆటలాడుతున్నట్టు సర్వేలో పేర్కొన్నారు. జిల్లాలోని 684 ప్రభుత్వ స్కూళ్లలో సుమారు 1.16లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో దాదాపు 85 శాతం పాఠశాలల్లో ప్లే గ్రౌండ్స్​ ఉన్నా ఆడించేందుకు పీఈటీలు లేరు. ఎనిమిదేండ్లుగా పీఈటీల నియామకాలు జరగపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.