భరతమాత గుడి ఎక్కడుంది...? కట్టించింది ఎవరో తెలుసా.. ?

భరతమాత గుడి ఎక్కడుంది...? కట్టించింది ఎవరో తెలుసా.. ?

ఉత్తరప్రదేశ్ లోని వారణాశి(కాశీ)లో భరతమాతకు గుడి ఉంది. దీన్ని కట్టించింది స్వాతంత్య్ర సమరయోధుడు బాబు శివప్రసాద్ గుప్తా. కాశీ విద్యాపీఠం యూనివర్సిటీని కట్టించింది కూడా ఈయనే.1936లో పూర్తి అయిన 'భరత మాత మందిర్'ను అదే ఏడాది మహాత్మాగాంధీ ప్రారంభించారు. గుడిలో అఖండ భారత్ మ్యాప్ ను తెల్లటి మార్బుల్తో తయారుచేశారు. ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, బర్మా, శ్రీలంక ఈ మ్యాప్ లో ఉన్నాయి. నదులు, మైదానాలు, హిమాలయ పర్వతాలు స్పష్టంగా కనిపిస్తాయి. 

ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల రోజున మ్యాప్లోని నదుల్లో నీళ్ళు పారేలా చేస్తారు. అలాగే మైదాన ప్రాంతాన్ని మందారపువ్వులతో అలంకరిస్తారు. ఈ గుడిలో ఇతర దేవతా విగ్రహాలేవీ లేవు. ఏటా కాశీకి వెళ్ళేవాళ్ళలో చాలామంది ఈ గుడిని కూడా చూస్తారు. ఇదే రాష్ట్రంలోని హరిద్వార్ లో కూడా భరతమాతకు గుడి ఉంది. అలాగేఉజ్జయిని (మధ్యప్రదేశ్), కన్యాకుమారి(తమిళనాడు) లో కూడా ఉన్నాయి.

బాపూజీకి, సమరయోధులకూ....

ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చడానికి కారణమైన జాతిపిత మహాత్మాగాంధీకి, సమరయోధులకు కూడా దేశంలో చాలాచోట్ల గుళ్ళు ఉన్నాయి. ఒడిసాలోని గంజాం జిల్లా బెర్హంపూర్ (బరంపురం) లో 1960లో గాంధీజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్కడి గొసానినుగావ్ ప్రాంతానికి 1921, 1946లో గాంధీజీ వచ్చారు. అక్కడ ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఈ ఏరియాలో ఒక గుడి కట్టారు. ఇందులో జగన్నాథుడు, రాముడు, శివుడి విగ్రహాలతోపాటు గాంధీజీ విగ్రహం కూడా కట్టించి పూజిస్తున్నారు. ఇదే రాష్ట్రంలోని సంబల్పూర్ జిల్లా బటారా గ్రామంలోనూ గాంధీజీకి గుడి ఉంది. 

ఇందులో బాపూజీ కాంస్య విగ్రహం ఉంటుంది. దళితులే ఇక్కడ పూజారులు. దీన్ని 1974లో స్థానిక ఎమ్మెల్యే అభిమన్యు కుమార్ కట్టించారు. అంటరానితనాన్ని తొలగించడంలో గాంధీజీ చేసిన సేవకు గుర్తుగా ఈ గుడిని కట్టించినట్లు చెప్తారాయన.మన తెలంగాణలోని నల్గొండ జిల్లా పెద్ద కాపర్తిలో, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ ఆవరణలో, కర్ణాటకలోని చిక్మగళూరు జిల్లాలోని నిడఘట్టలో, ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలోను గాంధీజీకి గుడి కట్టారు. వీటిల్లో కొన్ని చోట్ల తిలక్, భగత్ సింగ్ , బోస్ వంటి సమరయోధుల విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రీలంకలోని వల్లీపురం గ్రామంలో ఉన్న మహావిష్ణువు గోపురంపైన కూడా గాంధీ విగ్రహం కనిపిస్తుంది.