ODI World Cup 2023: కొలిక్కిరాని సెమీస్ బెర్తులు.. కొనఊపిరితో పాకిస్తాన్!

ODI World Cup 2023: కొలిక్కిరాని సెమీస్ బెర్తులు.. కొనఊపిరితో పాకిస్తాన్!

వన్డే ప్రపంచకప్‌ 2023లో దాయాది పాకిస్తాన్‌ జట్టు పోరాటం ముగిసినట్టే కనిపిస్తోంది. గురువారం శ్రీలంకతో మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్‌.. పాక్‌ సెమీస్‌ ఆశలకు గండికొట్టింది. ఈ గెలుపుతో కివీస్ జట్టు తమ సెమీఫైనల్‌  బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకుంది. కాకపోతే పాక్, ఆఫ్ఘన్ జట్లకు కాసింత అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు కూడా.. అద్భుతాలే.

ప్రస్తుతానికి న్యూజిలాండ్‌ 9 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో(10 పాయింట్లు) నాలుగో స్థానంలో ఉండగా.. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ 8 మ్యాచ్‌ల్లో నాలుగేసి విజయాలతో(8 పాయింట్లు) ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఇరు జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో విజయం సాధించి మూడు జట్ల పాయింట్లు  సమానమైనా.. నెట్ రన్‌రేట్‌ పరంగానూ కివీస్‌కే సెమీస్‌ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం కివీస్ రన్‌రేట్‌ +743గా ఉండగా, పాక్‌ +0.036 , అఫ్గానిస్తాన్‌ -0.338గా ఉంది.

పాక్ సెమీస్‌ చేరాలంటే..?

పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్‌లో నవంబర్‌ 11న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో పాక్.. ఇంగ్లాండ్‌ను 287 పరుగుల తేడాతో ఓడించడం కానీ, లేదంటే ఇంగ్లాండ్ నిర్ధేశించే లక్ష్యాన్ని 2.3 ఓవర్లలో ఛేదించడం కానీ  జరగాలి. అలా అయితేనే పాకిస్తాన్ రన్‌రేట్‌ పరంగా కివీస్‌ను కిందకునెట్టి నాలుగో స్థానానికి చేరుకోవచ్చు.

ఉదాహరణకు.. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 300 పరుగులు చేసిందనుకుంటే ఇంగ్లాండ్‌ను 13 పరుగులలోపే ఆలౌట్ చేయాలి. అదే మొదట ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసిందనుకుంటే వారు నిర్ధేశించే ఎంత లక్ష్యాన్నైనా 2.3 ఓవర్లలో చేధించాలి. ఈ రెండూ అసాధ్యమే కనుక పాకిస్తాన్ సెమీస్ ఆశలు ముగిసినట్టే అని చెప్పుకోవాలి. ఒకవేళ ఇంగ్లాండ్ ఆటగాళ్ల కాళ్లు చేతులు పట్టుకొని బ్రతిమలాడితే తప్ప ఈ అద్భుతాలు జరగదు.