ODI World Cup 2023: ముచ్చటగా మూడు విజయాలు.. 40 ఏళ్ల ప్రపంచకప్‌ చరిత్రలో మన సెమీస్‌‌ రికార్డులు

ODI World Cup 2023: ముచ్చటగా మూడు విజయాలు.. 40 ఏళ్ల ప్రపంచకప్‌ చరిత్రలో మన సెమీస్‌‌ రికార్డులు

రెండే మ్యాచ్‌లు.. రెండే విజయాలు.. సొంతగడ్డపై రోహిత్ సేన చరిత్ర సృష్టించడానికి కావాల్సిన లెక్కలివి. ప్రస్తుతం ఉన్న ఫామ్, సాధిస్తున్న విజయాలను బట్టి చూస్తే అదేం పెద్ద కష్టం కాకపోయినప్పటికీ.. మన జట్టుకు సెమీస్ అనేది ఒక గండం. గతంలో మన జట్టు లీగ్ దశలో ఎంత అద్భుతంగా ఆడినప్పటికీ.. సెమీస్‌కు వచ్చేసరికి అనేక సార్లు బోల్తా పడింది. అందునా న్యూజిలాండ్ గండం మనకు మరీ ఎక్కువ. ఆ జట్టు చేతిలోనే రెండు సార్లు ఓడాం. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు గత సెమీస్ రికార్డులు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్ జట్టు 7 సార్లు సెమీ ఫైనల్ చేరగా.. అందులో మూడింట మాత్రమే విజయం సాధించింది. 1983, 2003, 2011 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో విజయం సాధించగా.. 1987, 1996, 2015, 2019 సెమీ ఫైనల్స్‌లో ఓటమి పాలయ్యాం. ఈ లెక్కలను బట్టి మనం ఇప్పటివరకు సెమీస్‌లో గెలిచిన దాని కన్నా ఓడిందే ఎక్కువ. గతంలో ఏ జట్టుపై ఎలాంటి ప్రదర్శన చేశామో ఇప్పుడు చూద్దాం.. 
 
1983: వన్డే ప్రపంచ కప్ తొలి రెండు ఎడిషన్ల(1975, 1979)లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన టీమిండియా..1983లో తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో అతిథ్య ఇంగ్లాండ్‌ను 6 వికెట్ల తేడాతో మట్టి కరిపించి కపిల్‌ సేన ఫైనల్‌లో అడుగుపెట్టింది. అనంతరం ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 213 పరుగులకే కట్టడి చేసిన భారత్ జట్టు.. అనంతరం 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 

1987: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలోకి దిగిన భారత జట్టు వరుసగా రెండోసారి సెమీస్‌కు చేరింది. అయితే, ఈసారి ఇంగ్లాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. ముంబై, వాంఖడే వేదికగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 35 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్ 254/6 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో భారత జట్టు 219 పరుగులకే పరిమితమైంది.

1996: కోల్‌కతా అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఇక్కడే. కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 252 పరుగుల లక్ష్యఛేదనలో భారత జట్టు 120 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ ప్రదర్శన చూడలేని సొంత అభిమానులు మ్యాచ్ కు అంతరాయం కలిగించారు. ఆపై ఆట కొనసాగించడం సాధ్యపడకపోవడంతో అంపైర్లు శ్రీలంకను విజేతగా ప్రకటించారు.

2003: రెండో విజయం. సెమీస్‌లో టీమిండియా.. కెన్యాపై భారీ విజయాన్ని అందుకుంది. తొలుత భారత జట్టు 270/4 పొరుగులు చేయగా.. ఛేదనలో కెన్యా 179 పరుగులకే ఆలౌటైంది. 

2011: రెండోసారి టైటిల్. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టు మూడోసారి సెమీస్ గండాన్ని దాటింది. సెమీస్‌లో దాయాది పాకిస్థాన్‌ను 29 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 260/9 పరుగులు చేయగా.. ఛేదనలో పాకిస్థాన్‌ 231 పరుగులకే ఆలౌటైంది

2015: భారత క్రికెట్ అభిమానులు గుర్తుచేసుకోలేని ఓటమి ఇది. సొంతగడ్డపై ఆస్ట్రేలియా.. భారత జట్టును 95 పరుగుల తేడాతో మట్టి కరిపించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 329 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో భారత బ్యాటర్లు 233 పరుగులకే కుప్పకూలారు.

2019: వర్షం కారణంగా రెండు రోజులపాటు జరిగిన మ్యాచ్‌ ఇది. ఈ  మ్యాచ్ లో న్యూజిలాండ్‌ 18 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 

తొలుత కివీస్ 239/8 పరుగులు చేయగా.. ఛేదనలో టీమిండియా 221 పరుగులకే ఆలౌటైంది.

2023: ఇప్పుడు మరోసారి మన ప్రత్యర్థి కివీస్. ప్రస్తుత ఫామ్, బలబలాలను బట్టి కివీస్‌ను ఓడించడం రోహిత్ సేనకు పెద్ద కష్టం కాబోదు. విజయం సాధించి గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోబోతున్నాం..