
భువనేశ్వర్: జేఈఈ, నీట్ ఎగ్జామ్స్‌ను పోస్ట్‌పోన్ చేయాలని ప్రధాని మోడీకి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం మోడీతో నవీన్ ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారితోపాటు వరదల కారణంగా నెలకొన్న కఠిన పరిస్థితుల మధ్య పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. ఎగ్జామ్స్‌కు హాజరవ్వడానికి స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. రెండ్రోజుల కింద ఇదే విషయమై హెచ్‌ఆర్‌డీ మినిస్టర్ రమేశ్ పోఖ్రియాల్‌కు పట్నాయక్ లేఖ రాశారు. మహమ్మారి నేపథ్యంలో పరీక్షలకు హాజర్వవడం విద్యార్థులకు సురక్షితం కాదని సదరు లెటర్‌లో నివేదించారని సమాచారం.