అచ్చంగా ‘నవీన్’ పట్నాయకే

అచ్చంగా ‘నవీన్’ పట్నాయకే

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆలోచనల్లో చాలా మార్పు కనిపిస్తోంది. పదేళ్ల కిందట బీజేపీతో దోస్తానా కటీఫ్​ చేసుకున్నాక ఏ పార్టీతోనూ కలవలేదు. ఇన్నాళ్లూ ఒక్క తీరుగా పాలిటిక్స్​ నడిపిన పట్నాయక్​ ఇప్పుడు డిఫరెంట్​డెసిషన్స్​ తీసుకుంటున్నారు. ఎన్డీయేకి దగ్గరవుతున్నారు. సిటిజన్​షిప్​ సవరణ చట్టాని​కి బీజేడీ సపోర్ట్​ చేయటమే ఈ ఫ్రెండ్​షిప్​కి లేటెస్ట్ ఉదాహరణ. పట్నాయక్​ పాటిస్తున్న ఈ కొత్త పాలసీకి ఎనలిస్టులు కారణాలు వెతుక్కుంటున్నారు.

ఒడిశా లోని అధికార బిజూ జనతా దళ్​ (బీజేడీ) ఒకప్పుడు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకి మిత్రపక్షమే. 1998 లోక్​సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. ఆ స్నేహం పదేళ్లకుపైగా కొనసాగింది. 2008లో కాంధమాల్​లో జరిగిన హింసాకాండ ఈ రెండు పార్టీలను వేరు చేసింది. 2014లో మోడీ హవా సాగినప్పుడుకూడా బీజేడీ ప్రెసిడెంట్, సీఎం నవీన్​ పట్నాయక్ న్యూట్రల్​గానే ఉండిపోయారు. అయితే, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు సందర్భాన్ని బట్టి సపోర్ట్​ చేసేవారు. అదే తీరులో సిటిజన్​షిప్​ చట్టానికి సై అన్నారు.

వ్యతిరేకించింది తక్కువే!

2015లో మోదీ సర్కారు రూపొందించిన ‘మైన్స్​ అండ్​ మినరల్స్ (డెవలప్​మెంట్​ అండ్​ రెగ్యులేషన్​) అమెండ్​మెంట్​ బిల్లు–2015’కి బీజేడీ మద్దతిచ్చి రాజ్యసభలో పాసయ్యేలా చేసింది. 2017లో ఎన్డీయే ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్​నాథ్​ కోవింద్​కీ సపోర్ట్​ చేసింది. ఆ తర్వాత ఏడాది ఇతర నాన్​–ఎన్డీయే పక్షాలు లోక్​సభలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సైలెంట్​గా ఉండిపోయింది. సభలోనే ఉంటే వ్యతిరేకంగానో, అనుకూలంగానో ఓటేయాల్సి ఉంటుంది కాబట్టి, తెలివిగా వాకౌట్​ చేసింది.

పెద్ద నోట్ల రద్దు, గూడ్స్​ అండ్​ సర్వీసెస్​ ట్యాక్స్​ (జీఎస్​టీ) వంటి నిర్ణయాల్ని ముందుగా సమర్థించిన సీఎంలలో నవీన్​ పట్నాయక్​ ఒకరు. అలా అని ఆయన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారనుకుంటే పొరపాటు. జాతీయ, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకున్నారు. మహానది నీళ్ల గొడవ, పోలవరం ప్రాజెక్టు పంచాయతీ వంటి అంశాల్లో మోడీ గవర్నమెంట్​ని తీవ్రంగా విమర్శించారు. వరికి కనీస మద్దతు ధర పెంచాలని కోరుతూ… గత జనవరిలో రైతులతో ఢిల్లీకి ర్యాలీ కూడా నిర్వహించారు.

ఎన్నికల తర్వాత పూర్తిగా అనుకూలం

ఈ ఏడాది అటు లోక్​సభకు, ఇటు ఒడిశా అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. జనరల్​ ఎలక్షన్​లో ఎన్డీయే పోయినసారి కన్నా భారీ మెజారిటీతో మళ్లీ పవర్​లోకి వచ్చింది. ఒడిశాలో బీజేడీ వరుసగా ఐదోసారి అధికారం చేజిక్కించుకుంది. ఇక, అప్పటినుంచి నవీన్​ పట్నాయక్​ కేంద్రానికి పూర్తిగా ఫ్రెండ్లీగా మారిపోయారు. ట్రిపుల్​ తలాక్​ బిల్లుకు, ఆర్టికల్​–370 రద్దుకు ఓకే అనేశారు. నిన్నగాక మొన్న సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్​ (సీఏఏ)కి ఓపెన్​గానే సపోర్ట్ చేశారు. ఆ చట్టం వల్ల మన దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని చెప్పారు నవీన్​.

ఒడిశాకు ప్రధాన ఆదాయ వనరు మైనింగ్​​. కానీ… ఆ సెక్టార్​లో ఇప్పుడు పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. మిగతా రెవెన్యూ జనరేషన్​ రంగాల్లోనూ రాబడి మందగించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. సంక్షేమ పథకాలను కొనసాగించటం సవాల్​గా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదుకోవటం తప్ప మరో మార్గం లేదు. ఫణి తుఫాన్​ ప్రభావం నుంచి కోలుకోవటానికీ పెద్దఎత్తున డబ్బులు కావాల్సి వచ్చింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, పాలిటిక్స్​ని పక్కనపెట్టి, ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా నవీన్​ పట్నాయక్ అడుగులేస్తున్నారు.

‘కిసాన్​’ను కలుపుకున్న ‘కాలియా’

రైతులకు ఏటా రూ.10 వేలు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు​ పట్నాయక్​ ప్రభుత్వం ‘కృషక్ అసిస్టెన్స్​ ఫర్​ లైవ్​లీహుడ్​ అండ్​ ఇన్​కం ఆగ్మెంటేషన్​’(కాలియా) పథకం​ పెట్టింది. ఎన్నికల ముందు ప్రకటించిన ఈ స్కీమ్.. బీజేడీకి ఓట్ల వర్షం కురిపించింది.  ఆ తర్వాత ఫైనాన్షియల్​ క్రైసిస్​ వల్ల అంత డబ్బు ఇవ్వటం రాష్ట్ర ప్రభుత్వానికి కష్టంగా మారింది. ఫలితంగా రూ.10 వేలను రూ.4 వేలకు తగ్గించింది. ఆ నష్టాన్ని ‘ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి’ (పీఎం–కిసాన్​)తో భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో ‘కాలియా’, ‘కిసాన్​’ కలిసిపోయాయి.