ఒడిశాలో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌

ఒడిశాలో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌
  •  ప్రకటించిన ప్రభుత్వం
  • లాక్‌డౌన్‌ పొడిగించిన మొదటి రాష్ట్రం
  •  జూన్‌ 17వరకు స్కూళ్లు బంద్‌

భువనేశ్వర్‌‌: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఒడిశా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. గురువారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. 30 వరకు రైళ్లు, విమాన సర్వీసులను నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. జూన్‌ 17వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఇప్పటికే చాలా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. దానిపై ఆలోచిస్తున్నామని ప్రధాని మోడీ ఇప్పటికే ప్రకటించారు. కాగా.. దానిపై నిర్ణయం తీసుకున్న మొదటి రాష్ట్రం ఒడిశానే. “ కరోనా వైరస్‌ అనేది మానవజాతి ఎదుర్కొంటున్న అది పెద్ద ముప్పు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదనే విషయాన్ని మనందరం అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితులను ధైర్యంగా, కలిసికట్టుగా ఎదుర్కోవాలి. ఆ జగన్నాథుని ఆశీర్వాదం, మన త్యాగం వల్ల ఇది దాటుకుని పోతాం” అని నవీన్‌ పట్నాయక్‌ అన్నారు. జూన్‌ 17 వరకు ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ను క్లోజ్ చేస్తున్నామని, ప్రజల ఆహార భద్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తామని చెప్పారు. వ్యవసాయ, పశుసంవర్ధక, ఎమ్‌జీఎన్‌ఆర్‌‌ఈజీఎస్‌ సంబంధిత పనులు సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటిస్తూ చేసుకోవాలని చెప్పారు.