పెళ్లి పేరుతో మోసం.. ఎమ్మెల్యే పై కేసు నమోదు

 పెళ్లి పేరుతో మోసం.. ఎమ్మెల్యే  పై కేసు నమోదు

పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే  బిజయ్ శంకర్ దాస్ పై ఓ యువతి కేసు పెట్టింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని సీనియర్ బీజేడీ  లీడర్, మాజీ మంత్రి దివంగత బిష్ణుదాస్ కుమారుడు బిజయ శంకర్ దాస్, సోమాలికా దాస్  అనే యువతితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు.  వీరిద్దరూ మే 17 న పెళ్లి  చేసుకోవడానికి  రిజిస్ట్రార్​ ఆఫీస్ లో దరఖాస్తు చేసుకున్నారు.  ఆ దరఖాస్తును పరిశీలించిన అధికారులు జూన్ 17 (శుక్రవారం)న  పెళ్లి రిజిస్టర్ చేయటానికి స్లాట్ ఇచ్చారు. అనుకున్న సమయానికి సోమాలికా దాస్ రిజిస్ట్రార్​ ఆఫీస్ కి చేరుకుంది. కానీ  బిజయ్ శంకర్ దాస్, అతని కుటుంబ సభ్యులు మాత్రం అక్కడికి వెళ్లలేదు.   

దాదాపు మూడు గంటలపాటు ఎదురుచూసిన ఆమె మరుసటి రోజున  జగత్‌సింగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎమ్మెల్యే, అతని బంధువులపై ఫిర్యాదు చేసింది.  తనకు కాబోయే భర్త మోసం చేశాడని, వేధింపులకు కూడా పాల్పడినట్లుగా సోమాలికా తన ఫిర్యాదులో పేర్కొంది .  బిజయ్ శంకర్ దాస్  తనకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని, తన ఫోన్ కాల్స్ లకు స్పందించడం లేదని, మరో మహిళతో సంబంధంలో ఉన్నాడని భావిస్తున్నానని ఆమె తెలిపింది.

అంతేకాకుండా ఎమ్మెల్యే బంధువులు తనను, తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది. యువతి ఫిర్యాదు మేరకు IPC సెక్షన్లు 420, 195A, 294, 509, 341, 120B, 34 కేసుల్లో ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.