ఒడిశా టు తెలంగాణ..ఇంటర్ స్టేట్ గంజాయి దందా

ఒడిశా టు తెలంగాణ..ఇంటర్ స్టేట్ గంజాయి దందా
  •     నిర్మల్, అదిలాబాద్ కేంద్రంగా సరఫరా
  •     హైదరాబాద్ సహా 5 జిల్లాలకు విస్తరణ
  •     మహారాష్ట్రతోనూ లింకులు.. లగ్జరీ కార్లలో రవాణా
  •     శివారు ప్రాంతాల్లో అమ్మకాల నెట్​వర్క్

నిర్మల్, వెలుగు : ఒడిశా నుంచి తెలంగాణలోని ఐదు జిల్లాలకు గంజాయి సప్లయ్ జోరుగా సాగుతోంది. హైదరాబాద్, ఒడిశా, మహారాష్ట్రకు చెందిన కొంతమంది స్మగ్లర్లు ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున ఈ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒడిశా నుంచి నిర్మల్, అదిలాబాద్ జిల్లాలను కేంద్రంగా చేసుకొని సప్లయ్ దందా కొనసాగిస్తున్నారు. నిర్మల్ నుంచి జగిత్యాల, అలాగే భైంసా మీదుగా మహారాష్ట్ర వరకు గంజాయి ఎగుమతి, దిగుమతులను కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం నిర్మల్ జిల్లా కేంద్రంలో గంజాయి సప్లయ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా పెద్దఎత్తున కొనసాగుతున్న గంజాయి రాకెట్ వివరాలు బహిర్గతమయ్యాయి. 

కార్లలో ప్రత్యేక బాక్సులు తయారుచేసి..

ఒడిశాలోని మల్కన్ గిరి తదితర ప్రాంతాల నుంచి గంజాయిని వీరు రహస్యంగా హైదరాబాద్ తీసుకువచ్చి  ఆర్మూర్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, అదిలాబాద్ వరకు సరఫరా చేస్తున్నారు. సాదాసీదాగా కాకుండా లగ్జరీ కార్లలో గంజాయి సప్లై చేస్తుండడాన్ని గుర్తించిన పోలీసులు అవాక్కయ్యారు. అనుమానం రాకుండా కార్లలో ప్రత్యేక బాక్సులు తయారుచేసి వాటిల్లో గంజాయి పొట్లాలను దాచిపెట్టి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొంతకాలం నుంచి ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఆర్మూర్, జగిత్యాల, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు, వినియోగం పెరిగిపోవడంతో ఈ అంతర్రాష్ట్ర ముఠా వ్యవహారాలు బయటపడడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటికే ఇక్కడి పోలీసులు ఆయా ప్రాంతాల్లోని పోలీసు అధికారులను సంప్రదించి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. భైంసా సరిహద్దున గల మహారాష్ట్రలోని నాందేడ్, జాల్నా, ఔరంగాబాద్ నుంచి కూడా గంజాయి నిర్మల్ జిల్లాతోపాటు ఇతర ప్రాంతాలకు కూడా సరఫరా అవుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. యూత్ గంజాయికి అలవాటు పడుతున్న నేపథ్యంలో స్మగ్లర్లు తమ నెట్​వర్క్​ను మరింత విస్తరించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్లమ్ ఏరియాలు, శివారు ప్రాంతాల్లో రహస్యంగా గంజాయి విక్రయాలు సాగిస్తున్నారు. ప్రతిరోజూ రూ.లక్షల్లో ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. 

ప్రభావం చూపని అవగాహన కార్యక్రమాలు

గంజాయి వినియోగించవద్దంటూ స్కూళ్లు, కాలేజీలతో పాటు గ్రామాల్లో జరిగే కార్డెన్ సెర్చ్, కాంటాక్ట్ ప్రోగ్రాంలలో పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ ఇవేవీ వినియోగదారులపై పెద్దగా ప్రభావం చూపడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా యూత్ గంజాయి మత్తులో జోగుతున్నారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకుంటూ గంజాయి స్మగ్లర్లు ఇష్టారాజ్యంగా దందా కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే యువత జీవితాలు సర్వనాశనమయ్యే ప్రమాదం ఉంది. పోలీస్ నిఘా విభాగాలు ఇప్పటికైనా గంజాయి దందాను నిరోధించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం..

గంజాయి సరఫరాతోపాటు వినియోగం, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. నిఘాను మరింత విస్తృతం చేస్తాం. సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా పెడుతున్నాం. విస్తృతంగా గంజాయి వినియోగం వల్ల జరిగే అనర్థాలపై నిర్మల్, భైంసా, ఖానాపూర్ తదితర పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. గంజాయి అమ్మకాలు, వినియోగంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించాలి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.

– జానకి షర్మిల, ఎస్పీ, నిర్మల్​