ప్రాణాలు తీస్తున్న ఫిల్టర్ ఇసుక దందా.. నీళ్లు చేరి డేంజర్​ స్పాట్లు

ప్రాణాలు తీస్తున్న ఫిల్టర్ ఇసుక దందా.. నీళ్లు చేరి డేంజర్​ స్పాట్లు
  • గోతులు తవ్వుతుండడంతో అందులోపడి చనిపోతున్న చిన్నారులు
  • మహబూబ్​నగర్​లో  ఫిల్టర్​ ఇసుక కోసం విచ్చలవిడిగా తవ్వకాలు
  • పది ఫీట్ల మేర ఏర్పడుతున్న గోతులు
  • వాల్టా చట్టానికి విరుద్ధంగా కొనసాగుతున్న అక్రమ వ్యాపారం

ఇది  మహబూబ్​నగర్​ జిల్లా హన్వాడ మండలం చిరుమలుకుచ్చతండాలో  ఫిల్టర్ ఇసుక తయారీ కోసం తీసిన గొయ్యి.  మూడేండ్ల కింద బోనాల పండుగ రోజు ఆడుకుంటూ వస్తున్న ఆరేండ్ల చిన్నారి  ప్రమాదవశాత్తు గోతిలో  పడి చనిపోయింది.  అలర్ట్​ కానీ ఆఫీసర్లు ఈ గోతిని పూడ్చలేదు.  కానీ, వ్యాపారులు మాత్రం మట్టి  కోసం ఇక్కడ మళ్లీ తవ్వకాలు చేపట్టడంతో  దాదాపు 12 ఫీట్ల గొయ్యి  ఏర్పడింది.  11న తండాలో బోనాల పండుగ కావడంతో ముడావత్​ శివ (9), కేలావత్​ గణేశ్ (9)​ ఆడుకుంటూ వచ్చి ఈ గోతిలోకి దిగడంతో అందులో మునిగి చనిపోయారు.

మహబూబ్​నగర్, వెలుగు : మహబూబ్ నగర్​ జిల్లాలో  ఫిల్టర్ ఇసుక దందా ప్రజల ప్రాణాలు తీస్తోంది. పది నుంచి 15 ఫీట్ల లోతు వరకు మట్టిని  తోడి వదిలేస్తుండడంతో, వానాకాలంలో వాటిలోకి నీళ్లు చేరి డేంజర్​ స్పాట్లుగా మారుతున్నాయి.  ఈత సరదాతో  అందులోకి  దిగుతున్న పిల్లలు,  లోతును గుర్తించలేక మునిగి చనిపోతున్నారు.  ఈ దందా వాల్టా చట్టానికి విరుద్ధమని తెలిసినా..  కారకులపై యాక్షన్​ తీసుకోవడంలో ఆఫీసర్లు వెనకంజ వేస్తున్నారు.

రెండున్నరేండ్లుగా దందా..

మహబూబ్​నగర్​ నియోజకవర్గంలో వాగుల్లో ఇసుక నిల్వలు లేకపోవడంతో అధికార పార్టీకి చెందిన కొందరు లీడర్లు రెండున్నర ఏండ్లుగా కృత్రిమ ఇసుక (ఫిల్టర్​ ఇసుక) తయారు చేసి  క్యాష్​ చేసుకుంటున్నారు. దందా మొదట్లో మహబూబ్​నగర్​ రూరల్​ మండలంలోని కోటకద్ర, మాచన్​పల్లి, రాంచంద్రాపూర్ గ్రామాల వరకే పరిమితం కాగా, ఇప్పుడు ఇదే మండలంలోని ఓబులాయపల్లి, కోడూర్, జైనల్లీపూర్, వెంకటాపూర్, లాల్యానాయక్ తండా, మాచన్​పల్లితండా, రేగడిగడ్డతండా, హన్వాడ మండలంలోని ఇబ్రహీంబాద్​,  బుద్దారం, కారంతండా, గొండ్యాల్​, మునిమోక్షం ప్రాంతాలకు విస్తరించారు. కొందరు ఫిల్టర్​ ఇసుక తయారు చేసేందుకు వాగులను ఆక్రమించుకొని మట్టి కోసం తవ్వుతుండగా, మరికొందరు రైతుల పట్టా పొలాలను కొంటున్నారు.  ఆ పొలాల్లో పది ఫీట్ల లోతు నుంచి 15 ఫీట్ల లోతు వరకు మట్టి కోసం తవ్వుతున్నారు. అయితే, తవ్వకాల వల్ల గోతులు ఏర్పడుతుండడంతో వానలకు వాటిల్లోకి నీళ్లు చేరుతున్నాయి. నీళ్లు తాగేందుకు పశువుల, సరదాగా ఆడుకునేందుకు పిల్లలు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి చనిపోతున్నారు.

పర్మిషన్లు లేకున్నా..

ఫిల్టర్​ ఇసుక తయారుచేయడం చట్టరీత్యా నేరం.  ఈ ఇసుక తయారీకి పది నుంచి 15 ఫీట్ల వరకు మట్టిని తీయడం వల్ల గ్రౌండ్​ వాటర్ వేగంగా పడిపోతున్నది. ఫలితంగా తవ్వకాలు చేపట్టిన సమీప ప్రాంతాల బోర్లు వట్టిపోతాయి.  అందుకే ఫిల్టర్​ ఇసుక తయారీకి పర్మిషన్లు ఇవ్వరు.  కానీ, దందాలు చేసేది అధికార పార్టీ లీడర్లు కావడంతో ఆఫీసర్లు సైలెంట్​ అయ్యారు. ఫిల్టర్​ ఇసుక కేంద్రాలపై దాడులు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఈ దందాలపై ప్రజలు కంప్లైంట్​ చేస్తే అప్పటికప్పుడు హడావిడిగా కేసులు పెట్టి, వాహనాలను సీజ్​ చేస్తున్నారు. ఒకట్రెండు రోజుల తర్వాత ఎవరో ఒక లీడర్​ నుంచి ‘వదిలేయండి’ అని ఆఫీసర్లకు ఫోన్లు రాగానే, వెంటనే వదిలేస్తున్నారు.

రెండు నెలలుగా జోరుగా తయారీ..

వానకాలం రాకముందే దందాల నిర్వాహకులు ఏప్రిల్​, మే, జూన్​ నెలల్లో విపరీతంగా కృత్రిమ ఇసుక తయారు చేసి, గ్రామాల సమీపాల్లోనే  భారీగా డంపులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ డంపులను రెవెన్యూ ఆఫీసర్లు స్వాధీనం చేసుకోవడానికి వస్తే, సదరు లీడర్లు బెదిరింపులకు దిగుతున్నారు.  ఉదాహరణకు నెలన్నర కింద హన్వాడ మండలంలో కొందరు లీడర్లు ఫిల్టర్​ ఇసుకను తయారు చేసి ట్రాక్టర్లలో డంప్​ చేయడానికి తరలిస్తుండగా, స్థానికుల కంప్లైంట్​తో  ఆఫీసర్లు వాహనాలను సీజ్​ చేశారు. ఈ విషయంపై సదరు లీడర్లు ‘‘మేం లోకల్​ వాళ్లం. ప్రతీది మీరు పట్టించుకోనవసరం లేదు. కొన్ని విషయాల్లో చూసీచూడనట్లు ఉండాలె. మా లీడర్​తో ఫోన్​ మాట్లాడతారా? ఎట్లా? ’’ అని ఆఫీసర్​కు వార్నింగ్​ ఇవ్వడం కలకలం సృష్టించింది.

ఫిల్టర్ ఇసుక ఇట్ల తయారు చేస్తరు

ఫిల్టర్ ఇసుక తయారీ కోసం పట్టా భూములు,  వాగుల్లో పది నుంచి 15 ఫీట్ల వరకు మట్టిని తోడుతారు. ట్రాక్టర్లలో ఆ మట్టిని పోసి అక్కడే ఏర్పాటు చేసుకున్న బోర్లకు ఐదు ఇంచుల పైపులు పెట్టి  ప్రెషర్​తో  మట్టి నుంచి ఇసుకను వేరు(ఫిల్టర్​) చేస్తారు.  అలా వేరు చేసిన ఇసుకను అమ్ముకుంటారు. ట్రాక్టర్ ట్రిప్పుకు  రూ.1,800 నుంచి రూ.2,500 వరకు తీసుకుంటున్నారు. అయితే ఇది నదులు, వాగుల ఇసుకంత క్వాలిటీ ఉండదు. తక్కువ ధరకు వస్తుండడంతో జనాలు కొంటున్నారు. పెద్దగా ఖర్చులేకపోవడంతో అక్రమార్కులు ఈ ఇసుకను తయారుచేసి లాభాలు గడిస్తున్నారు.

కేసులు పెడ్తున్నా భయపడ్తలేరు..

ఫిల్టర్​ ఇసుక మంచిది కాదు. వాటి కోసం మేం ఎక్కడ పర్మిషన్లు ఇవ్వలేదు.  నేను వచ్చిన మూడేండ్లలో 40 సార్లు డంపులను డిమాలిష్​ చేశాం. 20 కేసులు పెట్టాం.  ట్రాక్టర్లను సీజ్​ చేసి స్టేషన్లకు తరలించినా ఎవరూ భయపడడం లేదు. 11న జరిగిన ఘటనపై పట్టాదారు మీద,  ఫిల్టర్​ఇసుక తయారు చేసిన వారి మీద కేసు పెడ్తున్నాం. 

- బక్క శ్రీనివాసులు, తహసీల్దార్​, హన్వాడ