
సంగారెడ్డిలో భూముల అమ్మకానికి ప్రీ బిడ్
రియల్టర్లకు అవగాహన కల్పించిన ఆఫీసర్లు
సంగారెడ్డి/రామచంద్రాపురం, వెలుగు : సంగారెడ్డి జిల్లాలోని 17 ప్రాంతాల్లో భూముల విక్రయానికి గురువారం పటాన్ చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఆఫీసర్లు ప్రీ బిడ్ మీటింగ్ నిర్వహించారు. దాదాపు 150 మంది ఔత్సాహికులు, రియల్టర్ల ప్రతినిధులు, స్థానికులు హాజరయ్యారు. మీటింగ్ కు హాజరైన బిడ్డర్లకు హెచ్ఎండీఏ అధికారులు, సంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు అమీన్ పూర్, ఇస్నాపూర్, రామచంద్రాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న భూముల గురించి అవగాహన కల్పించారు. వేలంలో కొన్న ప్రభుత్వ భూముల విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదని జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి చెప్పారు. వేలంలో కొన్న గవర్నమెంట్ భూములను స్వయంగా తహసీల్దార్ రిజిస్టర్ చేస్తారని, దానివల్ల బ్యాంక్ లోన్లకు ఎలాంటి సమస్య ఉండదన్నారు. నిర్మాణ అనుమతులు కూడా సులభంగా వస్తాయని, ప్రభుత్వమే పూర్తి భద్రత ఇస్తున్నప్పుడు ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు.
హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్ వేలం రూల్స్ తెలియజేశారు. ముందుగా వెబ్సైట్ద్వారా లాగిన్అయి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వేలంలో భూములు దక్కించుకున్నవారు పది రోజుల్లో 25 శాతం పేమెంట్ చేయాలని, 90 రోజుల్లో మిగతా 75 శాతం చెల్లించాలని చెప్పారు. 90 రోజుల్లో 75 శాతం చెల్లించనివారికి 180 రోజులలోపు పది శాతం వడ్డీతో చెల్లించే అవకాశం ఉందన్నారు. లేదంటే ముందు చెల్లించిన 25 శాతం సొమ్ము కూడా కోల్పోతారని చెప్పారు. బ్యాంకు లోన్లకు వెళ్లే వారికి 25 శాతం చెల్లించిన తర్వాత ఎన్ఓసీ అందజేస్తామని పేర్కొన్నారు. వేలం వేసే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వెబ్సైట్ద్వారా తెలుసుకోవచ్చన్నారు.