బతికున్నోళ్లు చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదు

బతికున్నోళ్లు చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదు

బోగస్ రేషన్ కార్డుల ఏరివేత పేరుతో నిరుపేదల కార్డులను ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులు రద్దు చేశారు. బతికున్నవాళ్లను చనిపోయినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. దీంతో ఎంతోమంది నిరుపేదలకు రేషన్ అందకుండా పోయింది. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న రేషన్ కార్డుల ప్రక్షాళన ప్రక్రియలో   అర్హుల పేర్లు తొలగించారన్న విమర్శలు వస్తున్నాయి. అనేకమంది నిరుపేదల రేషన్ కార్డులు రద్దయ్యాయన్న ఆరోపణలు వస్తున్నాయి. బోగస్ కార్డుల ఏరివేతలో భాగంగా చనిపోయినవారి పేర్లను కార్డుల నుంచి తొలగించి, కొత్తగా పుట్టిన వారి పేర్లను అధికారులు చేర్చుతున్నారు. కారు, బహుళ అంతస్థుల భవనం ఉన్నవాళ్లు, మూడున్నర ఎకరాలకుపైగా భూమి ఉన్నవారిని సంపన్నులుగా గుర్తించి రేషన్ కార్డులు తొలగిస్తున్నారు. 360 డిగ్రీల సాఫ్ట్ వేర్ సాయంతో  అనర్హులను గుర్తిస్తున్నారు. అయితే ఈ సాఫ్ట్ వేర్ లోని సాంకేతిక లోపాలు నిజమైన లబ్ధిదారులకు శాపంగా మారాయి. అర్హులైన నిరుపేదల రేషన్ కార్డులు కూడా రద్దయ్యాయి. అధికారుల చుట్టూ తిరుగుతున్నా జరిగిన పొరపాటును సరిచేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.  

పేర్లు కార్డుల్లోంచి మాయమయ్యాయి..

ఇప్పటికే చాలామంది పేర్లు కార్డుల్లోంచి మాయమయ్యాయి. దీంతో వాళ్ల పేర్లతో ఇంతకాలం వచ్చిన రేషన్ కోటా తగ్గించి పంపిస్తున్నారు. మానకొండూరు మండలం శ్రీనివాసనగర్ కు చెందిన కూర బాణవ్వ అనే వృద్ధురాలు, వికలాంగుడైన ఆమె భర్త పేరుతో రేషన్ కార్డు ఉంది. అయితే  ఆమె బతికుండగానే చనిపోయినట్లుగా కార్డు నుంచి పేరు తొలగించారు. దీంతో ఆమె భర్త పేరిట 6 కిలోల బియ్యం మాత్రమే వస్తున్నాయి. బాణవ్వ పేరుతో వచ్చే ఆరు కిలోలు బంద్ అయ్యాయి. సిమెంట్ బిల్లలతో కట్టుకున్న చిన్న గదిలో ఈ వృద్ధ దంపతులు ఉంటున్నారు . నేను బతికే ఉన్నా.. నా పేరు రేషన్ కార్డులో రాయండని బానవ్వ అధికారులను వేడుకుంటోంది.

జగిత్యాల జిల్లాలోనూ.. 

జగిత్యాల జిల్లాలోనూ అనేక మంది రేషన్ కార్డులు రద్దయ్యాయి. అనేక మంది చనిపోయినట్లుగా నమోదు చేసి కార్డుల్లోంచి పేర్లు తొలగించారు.  కోరుట్ల పట్టణంలోనూ అనేక మంది రేషన్ కార్డులు రద్దు రద్దయ్యాయి. మెట్ పల్లి మండలంలోని కొండ్రికర్ల గ్రామంలో ఆరుగురిని చనిపోయినట్లుగా చూపించి..  రేషన్ కార్డులను అధికారులు క్యాన్సిల్ చేశారు. రేషన్ కోసం రేషన్ షాప్ కి వెళ్తే మీ కార్డులు రద్దయ్యాయని రేషన్ డీలర్ తిప్పి పంపించారు. తమకు బియ్యం రావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డుల ప్రక్షాళనలో జరిగిన తప్పులను సరిదిద్దకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాని మండిపడుతున్నారు.