కళాకారుల గుడిసెలు తొలగింపు.. జేసీబీలతో కూల్చివేసిన ఆఫీసర్లు

కళాకారుల గుడిసెలు తొలగింపు.. జేసీబీలతో కూల్చివేసిన ఆఫీసర్లు

అలంపూర్, వెలుగు: పట్టణ సమీపంలో కళాకారులు వేసుకున్న గుడిసెలను ఆఫీసర్లు శనివారం పొద్దున తొలగించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో గద్వాల డీఎస్పీ రంగస్వామి, శాంతినగర్  సీఐ శివశంకర్ గౌడ్, ఎస్ఐలు, పోలీసు బందోబస్తు నడుమ ఉండవెల్లి తహసీల్దార్ వీరభద్రప్ప, వీఆర్ఏలు, హౌసింగ్  బోర్డ్  ఈఈ వెంకటరమణారెడ్డి, డీఈలు వెంకటేశ్వర్ రెడ్డి, సిరాజుద్దీన్, రమణమూర్తి, శ్రీధర్ రెడ్డి, ఏఈవో జగదీశ్వర్ రావు, అధికార యంత్రాంగం తొలగింపు చేపట్టారు. అలంపూర్ చౌరస్తాలో నియోజకవర్గంలోని కళాకారులు 261/ ఆ సర్వే నెంబర్​లో కొన్ని నెలల కింద70 తాత్కాలిక గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్ కాలనీగా పేరు పెట్టగా, కాలనీని ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు. అయితే ఈ స్థలం హౌసింగ్ బోర్డ్ కు చెందిందని చెబుతున్న ఆఫీసర్లు జేసీబీలతో గుడిసెలను నేలమట్టం చేశారు. 

తొలగించిన శిథిలాలను సమీపంలోని పాడుబడ్డ బావిలో వేశారు. అక్కడికి చేరుకున్న కళాకారుల సంఘం అధ్యక్షుడు రామనందారెడ్డి, కార్యదర్శి వెంకట్రామన్ గౌడ్​లను పోలీసులు అదుపులోకి తీసుకొని ఉండవెల్లి పోలీస్ స్టేషన్​కు కుతరలించారు. హౌసింగ్ బోర్డు కోసం 2009లో 28 ఎకరాల స్థలాన్ని సేకరించారు. అయితే ఇదే సర్వే నెంబర్ లో నజీరున్నిసా బేగం అనే పట్టాదారు నుంచి 2.20 ఎకరాల స్థలాన్ని సాదా బైనామాపై కొనుగోలు చేసినట్లు కళాకారులు చెబుతున్నారు. పట్టాదారుకు రూ.40 వేలు కళాకారులు చెల్లించకపోవడంతో, స్థలం ఇవ్వాలని ఆమె డిమాండ్​ చేశారు. దీనిపై కళాకారులు అలంపూర్  కోర్టును ఆశ్రయించగా, వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై పట్టాదారు జిల్లా కోర్టుకు వెళ్లగా, ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ వివాదం ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి చేరుకోగా, కళాకారులకు ఒక ఎకరం 75 సెంట్లు, పట్టాదారుకు 75 సెంట్లు చెందేలా ఒప్పందం చేసుకున్నారు. ఈ స్థలంలో కళాకారులు 2 నెలల కింద 70 గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. తమ భూమి ఎక్కడ ఉందో చూపించాలని కళాకారులు ఆఫీసర్లను కోరుతున్నారు.