
- 40 వేల ఎకరాల్లో పంటలు ఎండే ప్రమాదం
- ఆందోళనలో రైతులు
ఆర్డీఎస్ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించేందుకు తీసుకొచ్చిన తుమ్మిళ్ల లిఫ్ట్ మోటారును ఆఫీసర్లు బంద్ పెట్టారు. రిజర్వాయర్లు నిర్మించకపోవడం, కేవలం నదిలో నీటి లభ్యత ఆధారంగా లిఫ్ట్ చేస్తుండడంతో ఎప్పుడు మోటార్లు బంద్ పెడతారో తెలియని పరిస్థితి నెలకొంది. సరిపడా నీటి నిల్వలు లేవని మూడు రోజుల కింద అధికారులు తుమ్మిళ్ల దగ్గర పంపింగ్ ఆపేశారు. దీంతో ఇప్పటికే చివరి దశలో ఉన్న దాదాపు 40 వేల ఎకరాల పత్తి, మిరప పంటలు ఎండిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
గద్వాల, వెలుగు:
తుంగభద్ర నదిలో ఆర్డీఎస్ కింద 15.9 టీఎంసీల నీటి వాటా ఉంది. 87,500 ఎకరాల ఆయకట్టు ఉండగా ఎప్పుడు కూడా పూర్తిస్థాయిలో నీరివ్వలేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని తుంగభద్ర నదిలో నీళ్లు ఉన్నప్పుడు రెండు పంపుల ద్వారా ఎత్తిపోసేందుకు రూ. 783 కోట్లతో తుమ్మిళ్ల లిఫ్ట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి విడతలో రూ. 162 కోట్లతో రెండు పంపులు ఏర్పాటు చేసేందుకు జీవో జారీ చేసింది. ఎన్నికలవేళ హడావిడిగా ఒక పంపును ఏర్పాటు చేసి నీటిని ఎత్తిపోసింది. ఆర్డీఎస్ డిస్ట్రిబ్యూటర్స్ 22, 23 మధ్యలో పంపింగ్ చేసి డిస్ట్రిబ్యూటర్ 40 వరకు నీరు ఇవ్వాల్సి ఉంది. కానీ తుమ్మిళ్ల పనులు పూర్తి కాకపోవడంతో ఆ లక్ష్యం నెరవేరడం లేదు. 87,500 ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా కేవలం 40,000 ఎకరాలలోపే అందుతోంది. ఆఫీసర్ల నిర్లక్ష్యమే ఆర్డీఎస్ రైతులకు శాపంగా మారుతోంది. స్థానిక ఆఫీసర్లు తుంగభద్ర బోర్డు ఆఫీసర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కేసీ కెనాల్ కు సరైన నీటి వాటా కోసం ఇండెంట్ పెట్టాల్సి ఉంది. కానీ అలా పెట్టకపోవడంతో ఇప్పుడు తుమ్మిళ్ల దగ్గర ఎత్తి పోసేందుకు నీరు లేకుండా పోయింది. ప్రస్తుతం మిరప, పత్తి పంటలు చివరి దశలో ఉన్నాయి. నీరు లేకపోతే ఆ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దాదాపు 40 వేల ఎకరాల్లో పంట నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది.
రిజర్వాయర్ల ఊసే మరిచారు
ఫస్ట్ ఒక పంపు ద్వారా నీటిని అందించి ఆ తర్వాత మిగతా పనులను కంప్లీట్ చేస్తామని రాష్ట్ర సర్కారు పేర్కొంది. తుమ్మిళ్ల లిఫ్టులో భాగంగా వల్లూరు, మల్లన్నకుంట, జూలకల్లు గ్రామాల దగ్గర రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ ఊసే లేదు. అదేవిధంగా రెండు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక పంపు ద్వారానే నీటిని ఎత్తిపోస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. నీరు లేకపోవడంతో ఇప్పుడు ఆ పంపు కూడా నిలిచిపోయింది. అయితే నీళ్లు ఉన్నా.. లేకున్నా ఆర్డీఎస్ రైతులకు కష్టాలు తప్పడం లేదు. తుంగభద్ర నదిలో ఫుల్లుగా నీళ్లు ఉన్నప్పుడు ఒక మోటార్ ద్వారా పంపిణీ చేస్తున్నప్పటికీ ఆర్డీఎస్ కాలువలకు రిపేర్లు చేయకపోవడంతో ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి. గత ఏడాది మానవపాడు మండలంలో ఆర్డీఎస్ కాలువలు తెగిపోయి పంటలు మునిగి పెద్దఎత్తున నష్టపోయారు. తుమ్మిళ్ల లిఫ్ట్ పనులు పూర్తయితే ఈ పరిస్థితి ఉండదని రైతులు పేర్కొంటున్నారు.
రూ. లక్షల్లో నష్టపోతాం
ఎకరా మిర్చికి రూ. లక్ష వరకు పెట్టుబడి పెట్టా. ఇప్పుడు కాలువలకు నీరు బంద్పెట్టడంతో లక్షల్లో నష్టపోతాం. గత ఏడాది కాలువలు తెగి నష్టపోయాం. ఇప్పుడు నీళ్లు లేక నష్టపోవాల్సి వస్తోంది. - సుధాకర్, రైతు, మానవపాడు
నీళ్లు రాగానే లిఫ్ట్ చేస్తం
ప్రస్తుతం తుంగభద్ర నదిలో నీరు లేకపోవడంతో తుమ్మిళ్ల దగ్గర లిఫ్టింగ్ ఆగిపోయింది. మరో రెండు రోజుల్లో పంపింగ్ స్టార్ట్ చేస్తాం. ఆఫీసర్లు ఇండెంట్ పెట్టారు. సమస్య రాకుండా చూస్తాం.
- జయప్రకాశ్, డీఈ, తుమ్మిళ్ల లిఫ్ట్