కొత్త లోన్లు అంటూ మహిళల వెంటపడ్తున్న అధికారులు

కొత్త లోన్లు అంటూ మహిళల వెంటపడ్తున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డ్వాక్రా గ్రూపు సభ్యులు తీసుకున్న వడ్డీ లేని రుణాలకు సంబంధించిన మిత్తి పైసలను నాలుగేండ్లుగా ప్రభుత్వం చెల్లించట్లేదు. బ్యాంకుల నుంచి  మహిళలు తీసుకున్న లింకేజీ లోన్లకు నెలనెలా మిత్తిని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నప్పటికీ.. సర్కారు మాత్రం ఆ డబ్బులను తిరిగి జమ చేయట్లేదు. పైకి వడ్డీ లేని రుణాలను దేశంలో ఎక్కడా లేని విధంగా ఇస్తున్నామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పకుంటున్నా.. వాస్తవం మాత్రం మరోలా ఉంది. వడ్డీ డబ్బులను సర్కారు జమ చేయకపోవడంతో అవి ఏటా పెరిగి దాదాపు రూ.4 వేల కోట్లకుపైగా పేరుకుపోయాయి. 2021 – 22 బడ్జెట్​లో వడ్డీ లేని రుణాల మిత్తిని చెల్లించేందుకు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు కేటాయించినప్పటికీ.. నిరుడు హుజూరాబాద్ ఎన్నికకు ముందు రూ.200  కోట్లు మాత్రమే రిలీజ్ చేసింది. 2022 – 23 బడ్జెట్ లో రూ.1250 కోట్లు కేటాయించి.. ఏడు నెలలు దాటినా ఇప్పటివరకు పైసా విడుదల చేయలేదు. పైగా భారీగా లోన్లు తీసుకునేలా మహిళా సంఘాలను సెర్ప్ ఉన్నతాధికారులు.. సిబ్బందికి టార్గెట్లు విధిస్తున్నారు. దీంతో ఫీల్డ్ సిబ్బంది సంఘాలకు అవసరం లేకపోయినా టార్గెట్ రీచ్ అయ్యేందుకు కొత్త లోన్లు అంటగడుతున్నారు. లోన్ తీసుకోకుంటే గ్రూపు రద్దవుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతో మహిళా సంఘాల సభ్యుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఎన్నికలు వస్తేనే మహిళలు గుర్తుకొస్తరు..

రాష్ట్రవ్యాప్తంగా రూరల్, అర్బన్ ఏరియాలు కలిపి 5,80,345 డ్వాక్రా గ్రూపులున్నాయి. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలో 3,99,120 డ్వాక్రా గ్రూపులున్నాయి. ఇందులో 43,29,058 మంది సభ్యులు ఉన్నారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో 1,81,225 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. ఇందులో 19  లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 97 శాతం గ్రూపులు నెలనెలా కిస్తీ, మిత్తి చెల్లిస్తుండడం, ఇతర లోన్లు పెద్దగా రికవరీ కాకపోవడంతో ష్యూరిటీ లేకుండానే మహిళా సంఘాలకు రూ. 20 లక్షల వరకు లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. దీంతో సెర్ప్ అధికారులు కూడా ఏటా టార్గెట్లు పెంచుతున్నారు. కిందటేడాదిలో రూ.15 వేల కోట్లు రుణాలిచ్చారు.  2014–15లో రూ. 3,700 కోట్లు, 2015–16లో రూ. 5,200 కోట్లు, 2016–17లో రూ. 5,500 కోట్లు, 2017–18లో రూ. 5,900 కోట్లు లోన్లుగా ఇచ్చారు. 2018లో ఎన్నికలకు వెళ్లడానికి నెల ముందు నాలుగేండ్ల వడ్డీ బకాయి రూ. 1,900 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక నాలుగేండ్లుగా బ్యాంకులకు మిత్తి జమ చేయట్లేదు. దీంతో వడ్డీ భారం మహిళలపైనే పడుతోంది. 2018 – 19లో ఇచ్చిన రూ. 6,200 కోట్లు, 2019–20లో ఇచ్చిన రూ. 6,500 కోట్లు, 2020 – 21లో ఇప్పటి వరకు ఇచ్చిన రూ. 8 వేల కోట్ల రుణాలకు, 2021 – 22లో ఇచ్చిన రూ.15 వేల కోట్ల రుణాలకు మహిళలు చెల్లించిన రూ. 4 వేల కోట్ల మిత్తిని ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేయలేదు. నిరుడు హుజూరాబాద్ ఎన్నిక సమయంలోనే రూ.200 కోట్లు విడుదల చేసి.. ఆ నియోజకవర్గానికి చెందిన మహిళా సంఘాల ఖాతాల్లోనే ఎక్కువ మొత్తం జమ చేసింది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వస్తే తప్ప.. ప్రభుత్వం వడ్డీ పైసలు జమ చేసేలా కనిపించడం లేదని సెర్ప్ ఉద్యోగులే వాపోతున్నారు.

కొత్త గ్రూపుల్లో చేరేందుకు నో.. 

ఉమ్మడి ఏపీలో డ్వాక్రా గ్రూపులు ప్రారంభమైన రోజుల్లో వాటిలో చేరేందుకు పోటీ పడిన మహిళలు.. ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపట్లేదు. కొత్త గ్రూపుల ఏర్పాటుకు సెర్ప్  అధికారులు ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో  స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నా మహిళలు పెద్దగా పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో ఇంకా  
20 లక్షల మంది మహిళలు డ్వాక్రా గ్రూపుల బయటే ఉన్నారు. 

మహిళలకే రూల్స్.. సర్కార్​కు నో రూల్స్..  

లోన్లు తీసుకున్న మహిళా సంఘాలు ప్రతినెలా కిస్తీ చెల్లించాల్సిన తేదీకి ఒక్క రోజు లేటైనా.. ఆ నెల వడ్డీని తాము చెల్లించాల్సిన వడ్డీగా ప్రభుత్వం పరిగణించట్లేదు. ఏదైనా మహిళా సంఘం బ్యాంకులో ఇన్ టైంలో కిస్తీ చెల్లిస్తేనే ఆ నెల వడ్డీని ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీగా లెక్కగడుతున్నారు. కిస్తీ సకాలంలో చెల్లించకపోతే ఆ నెల వడ్డీని కోల్పోవాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళల విషయంలో మాత్రం రూల్స్​ను తప్పనిసరిగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. వారి ఖాతాల్లో వడ్డీ డబ్బులను జమ చేయడంలో మాత్రం రూల్స్​ పాటించడం లేదు.