తప్పుడు లెక్కలతో ఖజానాకు టానిక్ చిల్లు

తప్పుడు లెక్కలతో ఖజానాకు టానిక్ చిల్లు
  • వ్యాట్ ఎంతేస్తున్నరు? సర్కారుకు ఇచ్చేదెంత అన్న లెక్కలే లేవ్  
  • జీఎస్టీలో లిక్కర్ లేకున్నా.. బిల్లుల్లో వసూళ్లు  
  • ఎలైట్ వైన్ షాపులను బార్లుగా మార్చేసిన్రు
  • అన్నింటికీ 11 వరకే పర్మిషన్.. టానిక్​కు మాత్రం 12 దాకా
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎంపీ చేతిలో ఉన్నట్లు గుర్తింపు

హైదరాబాద్, వెలుగు: తప్పుడు ఇన్​వాయిస్ బిల్లులు ఇస్తూ టానిక్ ఎలైట్ వైన్స్​కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అసలు లిక్కర్ జీఎస్టీలోనే లేదు. అది స్టేట్ వ్యాట్ కిందకు వస్తుంది. అయినా లిక్కర్ పై జీఎస్టీ వసూలు చేస్తున్నట్లు ఇన్​వాయిస్ బిల్లుల్లో గుర్తించారు. పైగా ప్రత్యేక అనుమతులతో ఇచ్చిన ఎలైట్ వైన్స్​ను పూర్తిగా బార్​లా మార్చేసినా ఇన్నేండ్లు ఏ అధికారీ అటువైపు కన్నెత్తిచూడలేదు. 

ఇది బీఆర్ఎస్ పెద్దలకు సంబంధించినది అయినందుకే అధికారులెవరూ పట్టించుకోలేదని తెలుస్తున్నది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ ఎంపీ  ఆధీనంలో ఈ ఎలైట్ వైన్ షాప్ ఉన్నట్లు తెలిసింది. అన్ని వైన్స్​ల్లో మద్యం అమ్మకాలకు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంటే.. ఈ టానిక్ ఎలైట్ వైన్ షాప్​కు మాత్రం అర్ధరాత్రి 12 గంటల వరకూ పర్మిషన్ ఇచ్చారు. విదేశీ మద్యం విషయంలోనూ టానిక్​కు స్పెషల్ పర్మిషన్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పైగా అన్ని వైన్స్​లకు టెండర్లు వేస్తే.. ఈ ఎలైట్ వైన్​షాప్​కు మాత్రం ఎలాంటి టెండర్ లేకుండానే అత్యంత ఖరీదైన ప్రాంతంలో అనుమతించారు. 

సాధారణంగా రెండేండ్లకోసారి ప్రభుత్వం లిక్కర్ పాలసీని తీసుకువస్తుంది. అయితే టానిక్​కు ఏకంగా 5 ఏండ్లకు ఒకేసారి పర్మిషన్ ఇచ్చారు. ఇంత వెసులుబాటు ఇచ్చినా.. వీరి నుంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఎక్కువ మొత్తంలో ఫీజు ఏమైనా తీసుకున్నారా? అంటే అదీ లేదు. మిగతా వాటితో చూస్తే కేవలం రూ.5 లక్షలు మాత్రమే అదనంగా చెల్లించేలా ఉత్తర్వులిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వైన్స్​లకు ఉన్నట్లుగా టానిక్ ఎలైట్ వైన్ షాప్ సమయాన్ని రాత్రి11 గంటలకు కుదించింది. ఇతర ప్రత్యేక అనుమతుల్లో కొన్నింటిని రద్దు చేసింది. 

వ్యాట్ విషయంలో ఏదో మతలబు.. !

టానిక్ సంబంధిత వైన్స్​లపై కమర్షియల్​ట్యాక్స్ ఆఫీసర్లు సోదాలు చేసిన తర్వాత అసలు ఏం జరుగుతోందనే దానిపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. వ్యాట్ ఎగ్గొట్టి.. ఈ ఐదారేండ్లలో ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టారో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంతమొత్తంలో దోపిడీ జరిగిందనే దానిపై లెక్కలు వేస్తున్నారు. అసలు లిక్కర్​కు సంబంధించి వ్యాట్ ఎంత వస్తుందనే దానిపై ఒక క్లారిటీ లేకుండా గత కొన్నేండ్లుగా వ్యవహారం నడుస్తున్నట్లు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. 

70 శాతం రావాల్సిన వ్యాట్ విషయంలో ఏదో మతలబు జరుగుతున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మద్యం డిపోల నుంచి తెచ్చిన మద్యం లెక్కలను చూపించాలని.. సేల్స్ ఎంత అయ్యాయో వివరాలు ఇవ్వాలని టానిక్ ఎలైట్ ను అధికారులు కోరారు. లిక్కర్ సేల్స్ పెద్ద ఎత్తున జరుగుతుండటంతో ఎక్సైజ్ డ్యూటీ పెరుగుతున్నా.. వ్యాట్​లో మాత్రం గ్రోత్ ఉండకపోవడంపై కమర్షియల్ ట్యాక్స్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

అసలు వ్యాట్ ఎంత వేస్తున్నారనేదానిపై క్లారిటీ కూడా లేకుండాపోయింది. లిక్కర్ బాటిళ్లపై వసూలు చేస్తున్న మొత్తంలో వ్యాట్ ఇంక్లూజివ్ అని మెన్షన్ చేయకపోవడంపైనా అనుమానాలు వస్తున్నాయి. పైగా ఆ ఎలైట్ వైన్​షాప్​లో ఇతర ఫుడ్ ఐటమ్స్ అమ్మడం ఏంటని.. వాటికి ఏం ట్యాక్స్ వేస్తున్నారనే దానిపైనా ఓ లెక్కాపత్రం లేదు. 

ఇతర వైన్స్ లలోనూ తనిఖీలు 

టానిక్ వ్యవహారం బయటపడటంతో ఉలిక్కిపడిన ఎక్సైజ్ డిపార్ట్​మెంట్.. ఇతర వైన్స్​ల్లోనూ ఏం జరుగుతోందనే దానిపై మానిటరింగ్ పెంచింది. బుధవారం నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ వచ్చిన కంప్లయింట్లతో 10 వైన్స్​లలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. మద్యం అమ్మకాలు, విదేశీ లిక్కర్, ఇతర ఉల్లంఘనలను గుర్తించారు. ఐ లైఫ్ పబ్, మరో మూడు పబ్బులకు స్పెషల్ జీవోల ద్వారా అనుమతి ఇవ్వడంపైనా ప్రభుత్వం వివరాలను పరిశీలిస్తున్నది.