ఆస్ట్రేలియాలోని ఆ కిరాతక తండ్రీకొడుకులు.. పాకిస్తాన్ దేశానికి చెందిన వాళ్లు

ఆస్ట్రేలియాలోని ఆ కిరాతక తండ్రీకొడుకులు.. పాకిస్తాన్ దేశానికి చెందిన వాళ్లు

Bondi Beach Tragedy: ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని బాండి బీచ్‌లో హనుక్కా వేడుకల సందర్భంగా జరిగిన కాల్పుల సంఘటన ఒక్కసారిగా ప్రపంచాన్ని షాక్ కి గురిచేసింది. అయితే ఈ దాడి వెనుక పాకిస్తాన్‌కు చెందిన తండ్రి, కొడుకు ఉన్నారని అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు బయటపెట్టారు. అయితే ఈ దాడిని ఒక ఉగ్రవాద చర్యగా న్యూ సౌత్ వేల్స్ పోలీసులు అభివర్ణించారు. 

కాల్పులు జరిగిన ప్రాంతంలోనే 50 ఏళ్ల తండ్రిని పోలీసులు కాల్చి చంపగా.. 24 ఏళ్ల కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. పోలీసుల పహారాలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడిలో నిందితులు మినహా మొత్తం 16 మంది మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. 'చానుకా బై ది సీ' అనే రద్దీగా ఉండే బహిరంగ హనుక్కా వేడుకలో ఆదివారం సాయంత్రం ఈ దాడి జరిగింది. కాల్పుల శబ్దంతో పండుగ వాతావరణం విషాదంగా మారిపోయింది. ఒక్కసారిగా దుండగులు కాల్పులు జరపటంతో ప్రజలు బీచ్ నుంచి పరిసర వీధుల్లోకి భయంతో పారిపోయారు.

ప్రస్తుతం దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని, దాడి చేసినవారు, దానికి వాడిన ఆయుధాల గురించి కీలక వివరాలను ధృవీకరించామని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి సమీపంలో రెండు ఐఈడీలు దొరికాయని, వాటిని జాగ్రత్తగా డిఫ్యూజ్ చేసినట్లు వెల్లడించారు అధికారులు. దాడి చేసిన 50 ఏళ్ల తండ్రి లైసెన్స్ కలిగిన తుపాకీ హోల్డర్ అని తేలింది. అతని పేరు మీద ఆరు తుపాకులు నమోదు చేయబడి ఉన్నాయని.. ఈ నేరాలకు కూడా అవే ఆరు తుపాకులను ఉపయోగించినట్లు భావిస్తున్నారు పోలీసులు. 

అయితే ఈ దాడులకు కారణం ఏంటి.. ఎవరు వీరిని ప్రేరేపించారనే కోణాల్లో దర్యాప్తును ముందుకు తీసుకెళుతున్నారు అధికారులు. మెుత్తానికి ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఇద్దరు పోలీసులు కూడా గాయపడి చికిత్స తీసుకుంటున్నట్లు తేలింది. ఈ దాడికి ఐసిస్ కి ఏమైనా లింక్ అందా అనే ప్రశ్నకు జవాబు వెతికే పనిలో సిడ్నీ పోలీసులు బిజీగా ఉన్నారు.