
- ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన 335 స్కూళ్లలో ప్రారంభం
- జూన్ 1 వరకు క్యాంపుల నిర్వహణ
- 19 క్రీడాంశాల్లో శిక్షణ
రాజన్నసిరిసిల్ల,వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థుల్లో క్రీడాప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలు స్కూళ్లలో సమ్మర్ క్యాంపుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 335 స్కూళ్లలో క్యాంపులు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైన క్యాంపులు జూన్ 1 వరకు కొనసాగనున్నాయి. కరీంనగర్ జిల్లాలో 10 స్కూళ్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10, జగిత్యాలలో 10, పెద్దపల్లి జిల్లాలో 305 స్కూళ్ల
(ప్రైమరీ టూ హైస్కూళ్లు)ను ఎంపిక చేశారు.
ప్రారంభమైన క్యాంపులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా స్పోర్ట్స్, ఇతర ఇండోర్ గేమ్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు satgasc.telangana.gov.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో కేవలం ఆధార్ కార్డుతో ట్రైనింగ్ ఇచ్చేవారి వద్ద పేరు నమోదు చేసుకుంటే ఎంపిక చేసేవారు. కానీ ఈసారి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. 14 ఏండ్లలోపు బాలబాలికలు అప్లై చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా ఉదయం, సాయంత్రం వేళ్లలో మాత్రమే శిక్షణ ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇచ్చేందుకు ఫిజికల్ డైరెక్టర్లు, సీనియర్ స్పోర్ట్స్‌మెన్‌ను ఇప్పటికే ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు స్పోర్ట్స్ సామాగ్రిని కూడా అందిస్తున్నారు.
19 క్రీడాంశాల్లో శిక్షణ
సమ్మర్ క్యాంపుల్లో ఇండోర్, అవుట్ డోర్ మొత్తం 19 క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. కరాటే, యోగా, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, విలువిద్య, ఆర్చరీ, కబడ్డీ, అథ్లెటిక్స్, క్రికెట్, చెస్, క్యారం, జూడో, సాఫ్ట్ బాల్, ఖోఖో, ఫుట్ బాల్, హ్యాండ్‌బాల్.. వంటి క్రీడలతో పాటు డ్యాన్స్, ఇంగ్లీష్ గ్రామర్, మ్యాథ్స్, సైన్స్ క్లాసులు
నిర్వహించనున్నారు.
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి. ఆటల్లో ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ వేసవి సెలవుల్లో టైం వేస్ట్ చేసుకోకుండా ఆటల్లో మెలకువలు నేర్చుకోవాలి. ఇప్పటికే క్యాంపులు ప్రారంభమయ్యాయి.
రాందాస్, రాజన్నసిరిసిల్ల జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి