
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 3170 మంది
- అడ్మిట్ కార్డు, ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని సూచన
- మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష
ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరుగనున్న నీట్ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే అభ్యర్థులు ఐడీ కార్డు, అడ్మిట్ కార్డు, రెండు పాస్పోర్ట్సైజ్ ఫొటోలు వెంట తెచ్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుండగా.. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు సెంటర్లలోకి అనుమతించనున్నారు. ఎలాంటి పొరపాట్లు తావులేకుండా చర్యలు తీసుకోవాలని సెంటర్ల సూపరింటెండెంట్లకు ఆయా ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ల నుంచి ప్రశ్నపత్రాలు, పరీక్ష సామగ్రిని పోలీస్ బందోబస్తు మధ్య తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, ఏఎన్ఎం బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
12 పరీక్ష కేంద్రాల ఏర్పాటు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నీట్ పరీక్ష కోసం 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలుర), సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, ప్రభుత్వ బాలికల స్కూల్(భూక్తాపూర్), ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కాలేజ్, బంగారిగూడ మోడల్ స్కూల్, తెలంగాణ రెసిడెన్షియల్ మైనార్టీ స్కూల్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఆదర్శ స్కూల్, జడ్పీ బాయ్స్ హైస్కూల్, జడ్పీ గర్ల్స్హైస్కూల్, ఆసిఫాబాద్ జిల్లాలో సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్లో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్లో 1659 మంది అభ్యర్థులు, మంచిర్యాలలో 1224 మంది అభ్యర్థులు, ఆసిఫాబాద్ జిల్లాలో 287 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. నిర్మల్ జిల్లాలో సెంటర్లు ఏర్పాటు చేయలేదు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా శనివారం గూగుల్ మీట్ ద్వారా పరీక్ష నిర్వహణపై అధికారులు పలు సూచనలు చేశారు.
సెంటర్ల పరిశీలన
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల పట్టణలోని రాజీవ్ నగర్ ఆదర్శ స్కూల్, జడ్పీ గర్స్, బాయ్స్ స్కూల్స్, డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన సెంటర్లను కలెక్టర్ కుమార్ దీపక్, సీపీ అంబర్ కిషోర్ ఝా శనివారం పరిశీలించారు. ఎగ్జామ్ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు సూచించారు. 4 సెంటర్లలో 1224 మంది స్టూడెంట్స్ ఎగ్జాం రాయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్య లేకుండా, సెంటర్ల వద్ద పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. ఏసీపీలు రాఘవేంద్ర రావు, సీఐ ప్రమోద్ రావు పాల్గొన్నారు.