లోకసభకు ఎన్నికలకు ..కసరత్తు షురూ

లోకసభకు ఎన్నికలకు ..కసరత్తు షురూ
  •     ఏర్పాట్లు మొదలు పెట్టిన  అధికారులు  
  •     ఓటర్ జాబితాల సవరణ ప్రక్రియ షురూ 
  •     కొత్త ఓటర్ల  నమోదుకు అవకాశం

మెదక్​, వెలుగు : రానున్న లోకసభ ఎన్నికలకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు షురూ చేసింది. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్​ రాజ్ బుధవారం లోకసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలెక్టర్లు,  ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించి..  ఏర్పాట్లపై  దిశానిర్దేశం చేశారు. మెదక్​ లోకసభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అధికారులు ఓటర్లు,  పోలింగ్ స్టేషన్​ల వివరాలను సిద్ధం చేశారు.  ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

మెదక్ లోక్ సభ నియోజకవర్గానికి ఎన్నికల రిటర్నింగ్  అధికారిగా మెదక్ కలెక్టర్ వ్యవహరించనున్నారు.  నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొన్నటి  అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్​లుగా వ్యవహరించిన అధికారులు లోక్​సభ ఎన్నికల్లో ఆయా సెగ్మెంట్ల అసిస్టెంట్​ ​రిటర్నింగ్ ఆఫీసర్​ (ఏ.ఆర్​.ఓ.)గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. 

17,62,591 ఓటర్లు

మెదక్​ లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం,17,62,591 మంది ఓట్లర్లు ఉన్నారు. ఇందులో  8,75,046  మంది పురుషులు ,  8,87,182 మంది మహిళలు , 76 మంది ఇతరులు ఉండగా ..  157 మంది  సర్వీస్​ ఓటర్లు,  8 మంది ఎన్ ఆర్​ ఐ లున్నారు.  లోక్​ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్​లలో   మొత్తం 2,112 పోలింగ్​ స్టేషన్​లు ఏర్పాటు చేస్తారు.   2024 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటరుగా నమోదు అయ్యేందుకు అవకాశం ఉంది.

ఈ మేరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యేలా చూసేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు.  ఓటరు లిస్ట్​లో మార్పులు, చేర్పులు, అడ్రస్​ మార్పిడికి అవకాశం కల్పించారు.  కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తులను  పరిష్కరించి..  జనవరి 6న  డ్రాఫ్ట్​ ఓటర్​ లిస్ట్​  జాబితా ప్రకటించి అభ్యంతరాలను తీసుకుంటారు.  ఫిబ్రవరి 8న ఓటర్ల తుది  జాబితా ప్రకటిస్తారు.

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా  ఓటర్లు, పోలింగ్ స్టేషన్​లు 

సెగ్మెంట్    మొత్తంఓటర్లు    పోలింగ్​ స్టేషన్లు

పటాన్​చెరు     3,97,312              405
సంగారెడ్డి        2,38,336              281
నర్సాపూర్      2,21,277              305
మెదక్              2,16,843              274
దుబ్బాక          1,94,664              253
సిద్దిపేట          2,28,523              273
గజ్వేల్            2,65,636              321