నెలాఖరులో రుణమాఫీ లెక్కలపై క్లారిటీ

నెలాఖరులో రుణమాఫీ లెక్కలపై క్లారిటీ

 

  • మాఫీ పూర్తి చేశాకే స్పష్టత వస్తుందంటున్న ఆఫీసర్లు
  • వివిధ కారణాలతో పలు అకౌంట్లలో జమకాని మాఫీ సొమ్ము
  • అలాంటి  రైతుల కోసం స్పెషల్​ డ్రైవ్
  • రూ.5 వేల కోట్లు రిజర్వ్​చేసినట్టు సీఎం వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రుణమాఫీ లెక్కలపై ఈ నెలఖారుకు స్పష్టత రానుంది. పలు టెక్నికల్​సమస్యలతో కొందరు రైతుల అకౌంట్లలో మాఫీ సొమ్ము జమ కాలేదని, వాటిని క్లియర్​ చేసిన తరువాత ఆ రైతులకు కూడా మాఫీ అవుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు రేషన్​కార్డు లేని రైతుల విషయంలో కుటుంబాలను గుర్తించేందుకు ఫీల్డ్​ సర్వే చేసి.. కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారు. ఇలా 6 లక్షలకు పైగా రైతులున్నట్టు గుర్తించారు. వీరికి కూడా కొంత ఆలస్యంగా రుణమాఫీ సొమ్ము జమకానుందని చెప్తున్నారు. ఇక రూ.2 లక్షల పైన పంట రుణం రైతులకు కూడా ఆపైన మొత్తాన్ని చెల్లించిన రైతులకు క్రమపద్ధతిలో మాఫీ చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది. ఇవన్నీ స్పెషల్​ డ్రైవ్​లో పూర్తి కానున్నాయి. దీంతో ఇప్పుడున్న దానికంటే పంట రుణాల మాఫీ మొత్తం పెరుగుతుందని సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారి ఒకరు 'వెలుగు'కు వివరించారు. గతంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలోనూ ముందు అనుకున్న లెక్క కంటే కొంచెం అటు ఇటుగా రైతుల సంఖ్య, మాఫీ మొత్తం మారిందని తెలిపారు. బ్యాంకులు ఇచ్చే ప్రిలిమనరీ డేటా ఒకలా ఉంటుందని.. గైడ్​లైన్స్​ వచ్చాక తీసుకునే డేటాలో కొంత మార్పు ఉంటుందని ఆ అధికారి స్పష్టం చేశారు. 2014లో రుణమాఫీకి రూ.19 వేల కోట్లు అవసరం పడుతాయని నాడు సీఎంగా ఉన్న కేసీఆర్​ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. మొత్తం మాఫీ పూర్తయ్యేసరికి ఇందులో రూ.3 వేల కోట్లు తగ్గాయి. ఆ తరువాత 2018లో రెండోసారి అధికారంలో వచ్చిన తరువాత లక్ష రూపాయల లోపు పంట రుణాలు మాఫీ చేసేందుకు రూ.28,930 కోట్లు అవసరమని అంచనా వేశారు. చివరకు రూ.12 వేల కోట్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం రుణమాఫీ కోసం నిధులను పూర్తిస్థాయిలో కేటాయించిందని.. అర్హులైన అందరికీ కచ్చితంగా జమ చేసేలా ఆదేశాలు ఉన్నాయని ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి.  

బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు సాగిన మాఫీ ప్రక్రియ గత ప్రభుత్వ హయాంలో రెండుసార్లు రుణమాఫీ జరిగింది. మొదటిసారి దశలవారీగా మాఫీ చేశారు. 2014 నుంచి మొదలుపెడితే 2019 వరకు మాఫీ ప్రక్రియ కొనసాగింది. వాస్తవానికి ముందుగా రూ.19 వేల కోట్ల రూపాయలు మాఫీ మొత్తం ఉన్నదని, అదంతా ప్రభుత్వమే భరిస్తుందని జూన్​ 13 అసెంబ్లీ వేదికగా అప్పటి సీఎం కేసీఆర్​ ప్రకటించారు. అయితే, నాలుగు విడతల్లో  35.31 లక్షల మంది రైతులకు రూ.16,144.10 కోట్ల రుణాలు మాఫీ చేశారు. ఇందులో ఇంకో రూ.20 కోట్లు అదనంగా ఆ తరువాత చేశారు. మళ్లీ  అడిషనల్​గా కొంతమందికి  నిధులు ఇచ్చేదానిపై ఒకసారి రూ.150 కోట్లు అవసరమని ప్రతిపాదనలు వెళ్లాయి. ఇక 2018లో మళ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ హామీని అప్పటి టీఆర్​ఎస్​ ఇచ్చింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చాక ప్రాథమికంగా బ్యాంకుల నుంచి లెక్కలు తీయించింది. దాని ప్రకారం రూ.28,930 కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ లెక్క ప్రకారమే ప్రతి ఏడాదికి యావరేజ్​ గా రూ.6 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో మొత్తం పంట రుణాలు మాఫీ చేయాలని టార్గెట్​ పెట్టుకున్నది. కానీ, చివరకు 2023లో ఆ మొత్తాన్ని రూ.19 వేల కోట్లకు తగ్గింది. ఇందులో 2023లో రూ.12 వేల కోట్ల వరకు మాఫీ చేసి.. మిగిలిన రూ.7 వేల కోట్లు చెల్లిచంకుండా వదిలేసింది. పంట రుణాలు ప్రిలిమనరీగా గుర్తించడం.. ఆ తరువాత లెక్కలు మారడం అనేది సర్వసాధారణమని అధికారులు చెప్తున్నారు.

మూడు విడతల్లో రూ.18 వేల కోట్లు పూర్తి

రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇప్పటి వరకు పంట రుణాల మాఫీ కింద రైతులకు దాదాపు రూ.18 వేల కోట్లు చెల్లింపులు చేసింది. రూ.2 లక్షల వరకు పంట రుణాలు ఉన్న రైతులకు నిధులు రిలీజ్​ చేసింది. మొదటి విడతలో  రూ.6,098.93 కోట్లు 11,50,193 లక్షల మంది రైతులకు, రెండో విడతలో రూ.6,190.01 కోట్లు 6,40,823 మంది రైతులకు, మూడో విడతలో రూ.5,644.24 కోట్లు 4,46,832 మంది రైతులకు చెల్లింపులు చేసింది. ఇలా మొత్తం మూడు విడతల్లో  22.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.18 వేల  కోట్లు జమ చేసింది. మొత్తం రూ.31 వేల కోట్ల పంట రుణాలు ఉన్నట్టు ప్రాథమికంగా బ్యాంకుల ఇచ్చిన డేటాను ప్రభుత్వం ప్రకటించింది. అంత మొత్తం  మాఫీ చేసేందుకు  సిద్ధంగా ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్​ చేసినవి కాకుండా ఇంకో రూ.5 వేల కోట్లు రిజర్వ్​లో పెట్టినట్టు  తెలిపారు.