
మహబూబాబాద్, వెలుగు: వానా కాలంలో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆఫీసర్లు తగిన చర్యలను చేపట్టాలని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి వాసం వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. మంగళవారం జిల్లాలోని బయ్యారం పీహెచ్సీ, జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఫీవర్ వార్డు, ఫార్మసీ స్టోర్, ల్యాబ్, సంపూర్ణ సురక్ష కేంద్రం, ఐసీటీసీ సెంటర్ ను ఆయన పరిశీలించారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలని, క్రమం తప్పకుండా శానిటైజేషన్ చేయాలని అధికారులకు సూచించారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రజలకు వ్యక్తిగత శుభ్రత పై అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టిపెట్టి జిల్లాను సంపూర్ణ ఆరోగ్య జిల్లాగా నిలిచే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, హెల్త్ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు, డీఎంహెచ్వో రమేశ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.