
- హార్వెస్టర్ యజమానులతో ఆఫీసర్ల మీటింగులు
యాదాద్రి, వెలుగు : పాల కంకుల దశలోనే వరి పంట కోయకుండా యాదాద్రి జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగా వరి కోసే హార్వెస్టర్లపై నిఘా పెట్టారు. హార్వెస్టర్ల యజమానులతో మీటింగ్ నిర్వహించిన అధికారులు ముందస్తుగా పంట కొస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఈసారి సాగు అలస్యం
ఈసారి సకాలంలో వానలు పడలేదు. దీంతో వరి నాట్లు ఆలస్యంగా వేసుకున్నారు. ఆగస్టు చివరి వారంలో పెద్ద వానలు పడడంతో .. అదునుదాటినప్పటికీ రైతులు నాట్లు వేశారు. ఈ సీజన్లో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 2,82.890 ఎకరాల్లో వరి సాగయ్యింది. చాలావరకు దొడ్డు రకం వడ్డు సాగుచేయగా, ఎకరానికి 25 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చే చాన్స్ ఉంది. జిల్లా అంతటా వడ్ల కొనుగోళ్లకు సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లు చేస్తోంది. సాగు ముందే మొదలుపెట్టిన రైతులు కోతలకు సిద్ధపడడంతో కొనుగోలు సెంటర్లు ప్రారంభిస్తున్నారు.
ముందస్తు కోతలకు రెడీ
నాట్లు ఆలస్యం కావడంవల్ల వరి కోతలకు ఇంకా సమయం ఉంది. తరచూ వానలు కురుస్తుండడం, కూలీల కొరతతో రైతులు ముందుగానే కోతలకు సిద్ధమవుతున్నారు. దీనికి తోడు సమయానికి హార్వెస్టర్లు దొరుకుతాయో లేదో అన్న అనుమానంతో కొందరు రైతులు పాల కంకుల దశలోనే కోతలకు ప్లాన్ చేస్తున్నారు. జిల్లాలో ప్రతిసారి ఈ సమస్య వస్తోంది. నిబంధనల ప్రకారం 17 శాతం వరకు తేమ ఉంటేనే వడ్లను కొనుగోలు చేయాలి.
పాలకంకుల దశలో వడ్డు కోయడంవల్ల తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. తేమ తగ్గే వరకూ కాంటా వేయకపోవడంవల్ల రైతులు వారాల తరబడి సెంటర్లలోనే పడిగాపులు పడాల్సివస్తోంది. దీంతో సెంటర్లలో జాగా కొరత ఏర్పడుతోంది. మిల్లర్లు కూడా తేమ వల్ల నూక శాతం పెరుగుతుందని కొనుగోలుకు ఇంట్రెస్ట్ చూపడంలేదు. పైగా.. బహిరంగ మార్కెట్లో ధర కూడా తగ్గించేశారు.
ఈసారి పాలకంకుల దశలో కోతలు జరగకుండా నియంత్రించాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా హార్వెస్టర్ల ఓనర్ల లిస్ట్ రెడీ చేశారు. వారితో కలెక్టర్ హనుమంతరావు ఇటీవల మీటింగ్ నిర్వహించారు. అగ్రికల్చర్, సహకార శాఖ, డీఆర్డీఏ, పోలీస్ అధికారులు మీటింగ్లో పాల్గొన్నారు. పాల కంకుల దశలో వరి కోతలు కోస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఓనర్లను హెచ్చరించారు.