న్యూఢిల్లీ: రష్యా – ఉక్రెయిన్ యుద్ధంతో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయని, చౌకగా దొరికిన రష్యన్ ఆయిల్‌ను కొనకపోయి ఉంటే ఇండియాలో ఇన్‌ఫ్లేషన్ భారీగా పెరిగేదని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. ‘ఇండియన్ రిఫైనర్లు రష్యన్ ఆయిల్‌ను కొనకపోయి ఉంటే ఆయిల్ కొరత ఏర్పడేది. రోజుకి 19 లక్షల బ్యారెల్స్ అవసరం. ఆయిల్ రేటు బ్యారెల్‌కు అదనంగా 30–40 డాలర్లు పెరిగేది’ అని వెల్లడించింది. ‘ గ్లోబల్‌గా క్రూడాయిల్ మార్కెట్‌లో రోజుకి 10 కోట్ల బ్యారెళ్లు అవసరం అవుతాయి.
ఒకవేళ ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) రోజుకి ఒకటి లేదా రెండు మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ప్రొడక్షన్ తగ్గిస్తే, ధరలు 10 శాతం నుంచి 20 శాతం మేర పెరుగుతాయి. ఆయిల్ ధర బ్యారెల్‌కు 125 –130 డాలర్లకు చేరుకుంటుంది. ఒకవేళ ఇండియా రోజుకి 19.5 లక్షల బ్యారెల్స్‌ను రెడీ చేసుకోకపోతే ఈ ధరలు ఇంకా పెరిగేవి. అదే జరిగితే మార్కెట్‌లో గందరగోళం క్రియేట్ అయ్యేది’ అని పెట్రోలియం మినిస్ట్రీ ప్రతినిధులు పేర్కొన్నారు. క్రూడాయిల్ వాడకంలో ఇండియా మూడో ప్లేస్‌లో ఉందని, 85 శాతం డిమాండ్‌ను దిగుమతుల ద్వారానే చేరుకుంటున్నామని పేర్కొన్నారు.
దేశ రిఫైనింగ్ కెపాసిటీ రోజుకి 50 లక్షల బ్యారెల్స్ అని వెల్లడించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇండియాకు అతిపెద్ద ఆయిల్ సప్లయర్‌గా రష్యా ఎదిగింది. వెస్ట్రన్ కంట్రీస్ ఆంక్షలు పెట్టడంతో ఇండియాకు తక్కువ రేటుకే క్రూడాయిల్‌ను సప్లయ్ చేసింది. ప్రస్తుతం దేశ ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతానికి చేరుకుంది. రెండేళ్ల క్రితం ఈ నెంబర్ కేవలం 2 శాతం మాత్రమే. ఆంక్షలు కారణంగా రష్యన్ ఆయిల్ దిగుమతి చేసుకోవడంలో పేమెంట్స్, లాజిస్టిక్స్ విషయంలో ఇబ్బందులు పడ్డామని ఆయిల్ మినిస్ట్రీ వెల్లడించింది.
