కారును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. ముగ్గురు మృతి

కారును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. ముగ్గురు మృతి
  •  తప్పించుకునేందుకు ఓవర్ స్పీడ్​తో వెళ్లిన డ్రైవర్​.. ట్యాంకర్ బోల్తా
  • డ్రైవర్ మృతి.. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఘటన.

జోగిపేట/అల్లాదుర్గం, వెలుగు: చాయ్ తాగుదామని కారులో బయల్దేరిన ఆరుగురు యువకుల్లో ముగ్గురు రోడ్డు ప్రమాదంలో చనిపోగా.. మిగిలిన వారు గాయపడ్డారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న వీళ్ల కారును ఆయిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. సంగారెడ్డి జిల్లా మాసాన్ పల్లి శివారులోని సర్వీస్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. తర్వాత ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ కూడా కొద్దిసేపటికి మరోచోట జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని పోలీసులు వివరించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన వాజీద్, హాజీ, ముక్రమ్, రిజ్వాన్, హర్షద్, శంషు స్నేహితులు. చాయ్ తాగడానికి వీరంతా సోమవారం అర్ధరాత్రి జోగిపేట నుంచి సంగుపేటకు కారులో వెళ్లారు. 

అక్కడి నుంచి హైవే పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు మీదుగా డాకూర్ గ్రామం వైపు వెళ్తున్నారు. మాసాన్​పల్లి శివారు వద్దకు చేరుకోగానే టాయిలెట్ కోసం కారు ఆపారు. నలుగురు కారు నుంచి దిగగా.. ఇద్దరు లోపలే ఉన్నారు. ఒకరు టాయిలెట్ చేస్తుండగా.. మరో ముగ్గురు కారు పక్కనే నిలబడ్డారు. అంతలోనే ఆయిల్ ట్యాంకర్ వేగంగా కారుతో పాటు రోడ్డుపై ఉన్న  యువకులను ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో వాజీద్ (28), హాజీ (29), ముక్రమ్ (22) స్పాట్​లోనే చనిపోయారు. కారులో కూర్చున్న రిజ్వాన్ తీవ్రంగా గాయపడ్డాడు. హర్షద్, శంషు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయిల్ ట్యాంకర్ మాత్రం ఆగకుండా వెళ్లిపోయింది. రిజ్వాన్ ఉస్మానియా హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నాడు. వాజీద్ బైక్ మెకానిక్ కాగా, హాజీ ఏసీ మెకానిక్. ముక్రమ్ చికెన్ సెంటర్​లో పని చేస్తున్నాడు. వాజీద్​కు పోయిన ఏడాది మే 23న పెండ్లి అయింది. అతని భార్య సాజిదా తబస్సుమ్ 8 నెలల గర్భిణి. 

అల్లాదుర్గంలో ట్యాంకర్ బోల్తా 

కారును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ వెహికల్ ఆపకుండా వెళ్లిపోయాడు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం కాయిదంపల్లి సమీపంలోని 161 నంబర్ నేషనల్ హైవేపై ఓవర్ స్పీడ్ కారణంగా ట్యాంకర్ బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ కియారాం (24) చనిపోయాడు. ఆయిల్ ట్యాంకర్ హైదరాబాద్ నుంచి గుజరాత్ వెళ్తున్నది. డ్రైవర్.. గుజరాత్​లోని బార్మేర్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్ చేశాక భయపడి వేగంగా డ్రైవ్ చేయడంతోనే ట్యాంకర్ బోల్తా పడిందని అల్లాదుర్గం సీఐ రేణుకా రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అల్లాదుర్గం ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి చెప్పారు.