నోటరీ ప్లాట్ల రెగ్యులరైజేషన్​కు ఓకే ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

నోటరీ ప్లాట్ల  రెగ్యులరైజేషన్​కు ఓకే ...  ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ
  • నోటరీ ప్లాట్ల  రెగ్యులరైజేషన్​కు ఓకే ...  ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ
  • మీ సేవ ద్వారా అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే చాన్స్ 
  • 125 గజాలకుపైగా ఉన్న ప్లాట్లకు స్టాంప్ డ్యూటీ వసూలు
  • అన్ని మున్సిపల్‌‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వర్తింపు
  • 10 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం 
  • రెగ్యులరైజేషన్‌‌తో సర్కార్‌‌‌‌కు రూ.5 వేల కోట్ల ఆమ్దానీ

కరీంనగర్, వెలుగు:  నోటరీ ద్వారా కొనుగోలు చేసిన నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ రెగ్యులరైజేషన్‌‌కు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చిలో కేవలం హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల వారికే అవకాశమిచ్చింది. తాజాగా రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ నోటరీ ప్లాట్ల రెగ్యులరైజేషన్‌‌కు చాన్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మీ సేవా కేంద్రాల ద్వారా ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించింది. 125 గజాల్లోపు ప్లాట్లను ఫ్రీగా రెగ్యులరైజేషన్ చేస్తామని, 125 గజాలు దాటితే ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ వాల్యూ ప్రకారం స్టాంప్ డ్యూటీ, 5 రూపాయల పెనాల్టీ చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

రాష్ట్రంలో 23 లక్షల ఆస్తులు నోటరీపైనే.. 

ఉమ్మడి ఏపీ నుంచే చాలా మంది అర్బన్ ఏరియాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కేవలం నోటరీ ఆధారంగా ప్లాట్లు కొనుగోలు చేశారు. వీరిలో అవగాహన లేని వారు కొందరైతే, రిజిస్ట్రేషన్ చార్జీలకు భయపడి నోటరీ ద్వారా కొనుగోలు చేసిన వారు మరికొందరున్నారు. ఇలా హైదరాబాద్ సహా ఇతర నగరాలు, పట్టణాల్లో లక్షలాది ఇండ్లు నోటరీ కాగితాలపైనే ఉన్నాయి. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 13 లక్షల ఆస్తులు ఉండగా, ఇతర నగరాలు, పట్టణాల్లో మరో 10 లక్షల ఆస్తులు ఉంటాయని అంచనా. రూల్స్ ప్రకారం ఈ లావాదేవీలు రిజిస్టర్ కానందున భవిష్యత్‌‌లో కొనుగోలుదారులకు లీగల్‌‌గా సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ పలుమార్లు చర్చించి రెగ్యులరైజేషన్‌‌కు నిర్ణయించింది. రెగ్యులరైజేషన్ పూర్తయితే ఇండ్ల యజమానులు బ్యాంకు లోన్లు తీసుకునేందుకు అర్హత సాధిస్తారు. 

రెగ్యులరైజేషన్ ఇలా.. 

మీ సేవలో అప్లై చేసుకునే సమయంలో నోటరీ డాక్యుమెంట్లు, ల్యాండ్‌‌కు సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు, మున్సిపాలిటీ ఆస్తి పన్ను, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు రశీదులతో పాటు ఆ స్థలంలో ఉంటున్నట్లు రుజువు చేసే ఇతర ఆధారాలు జతచేసి సమర్పించాల్సి ఉంటుంది. వచ్చిన అప్లికేషన్లను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని అధికారుల కమిటీ స్క్రూటినీ చేసి పట్టా భూములు, నిషేధిత జాబితా భూములు(22ఏ)లుగా విభజిస్తుంది. ఇందులో నిషేధిత జాబితాలోని భూముల్లో ఉంటున్న వారి నుంచి వచ్చిన అప్లికేషన్లను మాత్రం జీవో నంబర్ 58, 59 కింద పరిశీలిస్తారు. ఫీజు విషయానికొస్తే 125 గజాల్లోపు స్థలంలో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు స్టాంప్ డ్యూటీ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 125 గజాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు దరఖాస్తు చేసుకునే సమయానికి ఉన్న మార్కెట్ వాల్యూను బట్టి స్టాంప్ డ్యూటీ, రూ.5 పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా 3 వేల చదరపు గజాల వరకు రెగ్యులరైజేషన్‌‌కు ప్రభుత్వం అవకాశమిచ్చింది. కోర్టు కేసులు, ఓనర్ షిప్ వివాదాలు ఉన్న ఆస్తులను రెగ్యులరైజేషన్ చేయరు. ఎలాంటి వివాదాలు లేని నిర్మాణాలనే రెగ్యులరైజ్ చేస్తారు. 

సర్కారుకు మస్తు ఆమ్దానీ..

నోటరీ ద్వారా కొనుగోలు చేసిన ఆస్తుల్లో 125 గజాలకుపైగా ఉన్నవి కూడా రాష్ట్రంలో 7 లక్షల వరకు ఉన్నాయని అంచనా. వీటి రెగ్యులరైజేషన్‌‌కు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేయడం ద్వారా సుమారు రూ.5 వేల కోట్లు ఆదాయం సర్కార్‌‌‌‌కు సమకూరనుంది. అలాగే, 23 లక్షల ఆస్తుల రెగ్యులరైజేషన్ వల్ల భవిష్యత్‌‌లో వీటిని ఎన్నిసార్లయినా అధికారికంగా అమ్మకాలు, కొనుగోళ్లు చేయడానికి అవకాశముంది. దీంతో రిజిస్ట్రేషన్ శాఖకు స్టాంప్‌‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌‌ ఫీజులతో రాబడి రానుంది. కొనుగోలు తర్వాత మ్యుటేషన్‌‌, ఆస్తి పన్ను ద్వారా మున్సిపాలిటీలకు ఆదాయం వస్తుంది. 

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.. 

గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నోటరీ ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయేతర భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అరుదైన అవకాశం కల్పించింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో ఇలాంటి ఆస్తులు ఉన్నవారు అక్టోబర్ 31 వరకు మీ సేవ కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు.  - బి.గోపి, జిల్లా కలెక్టర్, కరీంనగర్