ప్యాక్టరీలో 10 వేల మంది ఉద్యోగులు.. అంతా మహిళలే

ప్యాక్టరీలో 10 వేల మంది ఉద్యోగులు.. అంతా మహిళలే

ముంబై: ప్రపంచంలోనే తొలిసారి ఒక స్కూటర్ తయారీ ఫ్యాక్టరీలో మొత్తం మహిళలే పని చేయబోతున్నారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌‌ తయారీ కోసం ఏర్పాటు చేసిన ‘‘ఓలా ఫ్యూచర్య ఫ్యాక్టరీ”లో మొత్తం పది వేల మంది మహిళా ఉద్యోగులు మాత్రమే ఉంటారని ఆ కంపెనీ సీఈవో, వ్యవస్థాపకుడు భవిష్‌ అగర్వాల్‌ ప్రకటించారు. ప్రపంచంలోనే మహిళలు మాత్రమే ఉండే అతి పెద్ద, తొలి ఆటోమోటివ్‌ కంపెనీగా ఓలా కొత్త రికార్డు సృష్టించింది. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు మరిన్ని అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భవిష్ తెలిపారు.  ఇందుకు అవసరమైన నైపుణ్యాలు పెంచుందుకు అవసరమైన శిక్షణను ఇచ్చామని, ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ప్రతి పనినీ వాళ్లే చేస్తారని చెప్పారు. మహిళలకు ఆర్థికంగా బలపడే అవకాశాలు పెరిగితే వాళ్ల జీవితాలతో పాటు కుటుంబాల పరిస్థితులు కూడా మెరుగుపడుతాయని అన్నారు. అంతే కాదు మొత్తంగా సమాజమే మారుతుందని చెప్పారు. మహిళలకు లేబర్ వర్క్స్‌లో ప్రయారిటీ పెంచితే భారత్ జీడీపీ 27 శాతం పుంజుకుంటుందని ఇప్పటికే కొన్ని సర్వేల్లో తేలిందని భవిష్ తెలిపారు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో పేరుతో రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఈ ఏడాది జులైలో తొలిసారి వీటి బుకింగ్ ప్రారంభించింది. రూ.500 టోకెన్ అడ్వాన్స్‌ కట్టి ఆన్‌లైన్‌లో స్కూటీ బుక్ చేసుకోవచ్చని ప్రకటించిన తర్వాత కేవలం తొలి 24 గంటల్లోనే లక్షకు పైగా బుకింగ్స్ వచ్చాయి. ఈ నెల 8 తేదీన సేల్‌ను ఆన్‌లైన్ ద్వారానే ప్రారంభించాలని భావించినప్పటికీ సైట్‌లో టెక్నికల్ సమస్యలు రావడం వల్ల ఈ నెల 15వ తేదీకి వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ–స్కూటర్‌‌లను కొనుగోలు చేసిన వాళ్లకు అక్టోబర్ నుంచి డెలివరీలు అందుతాయి.