నేటి నుంచి పాత పంటల జాతర

నేటి నుంచి పాత పంటల జాతర
  •    జహీరాబాద్ లోని జడిమల్కాపూర్ లో ప్రారంభం
  •     విత్తనశుద్ధి, మార్కెటింగ్ పైనా స్థానికులకు అవగాహన
  •     23 ఏళ్లుగా పస్తాపూర్  మహిళా రైతుల కృషి
  •     వచ్చే నెల 16 వరకు జాతర

సంగారెడ్డి/జహీరాబాద్, వెలుగు : ఆరోగ్యకరమైన పాత పంటల జాతరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్  నియోజకవర్గం మొగుడంపల్లి మండలం జడిమల్కాపూర్  గ్రామం వేదిక కానుంది. చిరుధాన్యాలపై జడిమల్కాపూర్  కేంద్రంగా అవగాహన కార్యక్రమం కొనసాగుతోంది. అందరికీ పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో ఎడ్లబండ్ల మీద రోజుకో ఊరు తిరుగుతూ మిల్లెట్ల సాగు, సేంద్రియ వ్యవసాయం, వాటి ప్రయోజనాలపై డెక్కన్  డెవలప్మెంట్  సొసైటీ (డీడీఎస్) ప్రోత్సాహంతో పస్తాపూర్  మహిళా రైతులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా పాత పంటల జాతర సంగారెడ్డి జిల్లాలోనే జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం జడిమల్కాపూర్ లో 24వ పాత పంటల జాతర ప్రారంభించనున్నారు. నెల రోజుల పాటు కొనసాగి ఝరాసంఘం మండలం మాచునూర్   డీడీఎస్  పచ్చశాలలో జరిగే సభతో వచ్చే నెల 16న జాతర ముగుస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎడ్లబండ్ల జాతర విశేషంగా ఆకట్టుకోనుంది. ఎడ్లబండ్లను అందంగా అలంకరించి సంప్రదాయబద్ధంగా డప్పు చప్పుళ్లు, గ్రామీణ నృత్యాలు, ఆటపాటలు, కోలాటాల ప్రదర్శనలు చేస్తూ మహిళా రైతులు ఊరూరు తిరుగుతారు. మట్టి కుండలలో చిరుధాన్యాలను ఉంచి వాటి గురించి ప్రజలకు తెలియజేస్తూ ప్రదర్శన చేయడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. అలా తెచ్చిన ధాన్యాలకు ప్రతి గ్రామంలో సంప్రదాయ పూజలు చేస్తారు. గ్రామాలకు వచ్చే ఎడ్ల బండ్లకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి ఆ గ్రామంలో తిప్పుతారు. పాత పంటలను పండిస్తున్న విధానాన్ని వీడియోల ద్వారా గ్రామంలో ప్రదర్శించి మిల్లెట్లపై అవగాహన కల్పిస్తారు. దాదాపు 80 రకాల చిరుధాన్యాలు, సాగులో లేని ఆకుకూరలను కూడా ప్రదర్శనలో ఉంచి పరిచయం చేయడం ఈ జాతరలో విశేషం.

సాగులోలేని పంటలపైనా ప్రచారం

పౌష్టికాహారంతో కూడిన ఆరోగ్యకరమైన పంటలపై పస్తాపూర్  డీడీఎస్ మహిళా రైతులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ విత్తనాలను దేవుళ్లుగా కొలిచి పూజలు చేయడం ఇక్కడి మహిళా రైతుల ప్రత్యేకత. రాగులు, కొర్రలు, అవిసలు, జొన్నలు, సామలు, సజ్జలు వంటి మిల్లెట్లతో పాటు సాగులో లేని దాదాపు 80 రకాల ఆకుకూరలు, నేటి సమాజానికి తెలియని ఇతర పాత పంటలను కూడా ప్రజలకు వీరు పరిచయం చేస్తున్నరు. కాలానుగుణంగా మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆరోగ్యకరమైన పంటలను ప్రజలకు అందించేందుకు డీడీఎస్  మహిళా రైతులు 24 ఏళ్ల క్రితం వినూత్న తరహాలో ప్రచారం ప్రారంభించారు. డీడీఎస్  మహిళలు చిరుధాన్యాల గురించి చెప్పడమే కాకుండా వాటి సాగు వినియోగంపైనా మెళకువలు నేర్పిస్తున్నారు. రోగ నిరోధక చర్యలు, జీవన శైలిలో వచ్చే ఆరోగ్య సమస్యలపై ఈ జాతర సందర్భంగా గ్రామాల్లోని రచ్చబండల వద్ద చర్చిస్తున్నారు. ఈ పాత పంటల జాతరకు వివిధ దేశాల స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరవనున్నారు.

సేంద్రియ ఎరువుల వాడకం

చదువురాని ఎంతో మంది మహిళా రైతులు 80 రకాల విత్తనాలను సొంతంగా తయారు చేస్తున్నారు. రసాయన ఎరువులను ఉపయోగించకుండా ఆవుపేడ సాయంతో సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచుతున్నారు. పాత కాలంలో వినియోగించిన ఎరువుల తయారీ వాడకాన్ని మళ్లీ ఆర్గానిక్  ఎరువుల రూపంలో పరిచయం చేస్తున్నారు.

కమర్షియల్  క్రాప్స్  మాదిరిగా కాకుండా సేంద్రియ విత్తనాలను మార్కెటింగ్  చేసేందుకు వాటిని ప్రత్యేకంగా భద్రపరుస్తున్నారు. తెల్లగవ్వల కూర, ఉత్తరేణి, జొన్నచేంచేలి, పొనగంటి కూర, తలేల్ల ఆకుకూర, ఎలక చెవినకూర, సన్నపాయల కూరలు ఇలా దాదాపు 80 రకాల పోషకాలు ఆ విత్తనాలు తయారు చేస్తున్నారు. వాటితో డీడీఎస్  మహిళలు ఏటా ప్రత్యేక ఆకుకూరల జాతర నిర్వహించి వంటలు వండి వన భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు.

ప్రజల్లో మార్పు కోసం  

మనం తినే ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి. ప్రస్తుత రోజుల్లో కలుషిత ఆహారం తినడం వల్ల చిన్నపిల్లలు కూడా రోగాల బారినపడుతున్నారు. అందుకే మనం తినే ఆహారంలో మార్పులు వస్తేనే వచ్చే తరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక పెద్దల విషయానికొస్తే ప్రస్తుత రోజుల్లో పాత పంటలు వారికి కూడా అందుబాటులో లేకుండా పోయాయి. ఆరోగ్యపు అలవాట్లు పెద్దలను మరో పదేళ్లు అదనంగా బతికిస్తుంది. అందుకే ఊరూరూ తిరుగుతూ పౌష్టికాహారం గురించి తెలియజేస్తూ పాత పంటలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం.
- జనరల్ నర్సమ్మ ,  డీడీఎస్ మహిళ 

ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత విస్తరిస్తం 

డీడీఎస్  సహకారంతో పాత పాటలను ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. పంటల విత్తనాల మొదలు మార్కెటింగ్  వరకు డీడీఎస్  మాకు తోడునీడగా ఉంటున్నది. మా సేవలను ఇతర దేశాలకు కూడా పరిచయం చేస్తున్నాం. చిరుధాన్యాలు నిల్వ ఉంచే బ్యాంకులు కూడా ఏర్పాటు చేశాం. ప్రస్తుతానికి మా సేవలు గ్రామీణ ప్రజలకే కాకుండా హైదరాబాద్ తోపాటు ఇతర నగరాలకూ విస్తరించాం. ప్రభుత్వం ప్రోత్సహిస్తే చిరుధాన్యాల పంటలను మరింతగా విస్తరిస్తాం.
- శ్యామలమ్మ (జడిమల్కాపూర్)