వృద్ధురాలు, మనవరాలి దారుణ హత్య.. బంగారం, డబ్బు చోరీ

వృద్ధురాలు, మనవరాలి దారుణ హత్య..  బంగారం, డబ్బు చోరీ

షాద్ నగర్, వెలుగు: డబ్బు, బంగారం కోసం వృద్ధురాలితోపాటు ఆమె మనవరాలి గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామకు చెందిన ఎర్రగారి పార్వతమ్మ(60) ఒంటరిగా ఉంటోంది. కొన్నిరోజుల కిందట అదే గ్రామంలో ఉండే తన అక్క బిడ్డ శశికళ కూతురు భానుప్రియ(9)ను పార్వతమ్మ తన ఇంటికి తీసుకొచ్చింది. వీరిద్దరూ బిల్డింగ్​లోని ఓ పోర్షన్​లో ఉంటుండగా, ఖాళీగా ఉన్న మరో పోర్షన్ ను గురువారం ఐదుగురు వలస కార్మికులకు రెంట్​కు ఇచ్చింది. కాగా శుక్రవారం సాయంత్రం వరకు పార్వతమ్మ బయటికి రాకపోవడంతో భానుప్రియ వచ్చి చూడగా భానుప్రియ రక్తపు మడుగులో చనిపోయి పడి ఉంది. పార్వతమ్మ తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతోంది. స్థానికుల సాయంతో వృద్ధురాలిని హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయింది.

గ్రామస్తుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లూస్ టీమ్, డాగ్​స్క్వాడ్​తో ఆధారాలు సేకరించారు. ఇంట్లో డబ్బు, బంగారం మాయమైనట్లు గుర్తించారు. రెంట్​కు వచ్చిన వలస కార్మికులు కనిపించకపోవడంతో డబ్బు, బంగారం కోసం వారే గొంతు కోసి హత్య చేసి ఉంటారని పోలీసులు  అనుమానిస్తున్నారు. డెడ్​బాడీలను షాద్​నగర్​ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టామన్నాని, నిందితులను పట్టుకునేందుకు 2 టీమ్స్​ను ఏర్పాటు చేశామని 
ఆయన తెలిపారు.