పాత ఫోన్​ను ఇలా వాడొచ్చు!

పాత ఫోన్​ను ఇలా వాడొచ్చు!

ఈ  రోజుల్లో స్మార్ట్​ఫోన్లను చాలామంది ఏడాదికంటే ఎక్కువ కాలం వాడట్లేదు. కొందరు ఏడాదికో కొత్త ఫోన్​ కొనుక్కుని పాత ఫోన్​ మార్చేస్తున్నారు. మార్కెట్లోకి కొత్త ఫీచర్లతో మరో ఫోన్​ వచ్చిందంటే పాతవాటిని పక్కనపెట్టేస్తున్నారు. పాత ఫోన్లను తిరిగి అమ్మినా మంచి రేటు రావడం లేదు. దీంతో కొందరు ఇంట్లో వాటిని ఊరికే వదిలేస్తున్నారు. అయితే వర్క్​ చేసే కండిషన్లో ఉన్న స్మార్ట్​ఫోన్లను ఇతర అవసరాల కోసం వాడుకోవచ్చు.

యూనివర్సల్ రిమోట్

మీ స్మార్ట్​ఫోన్లో ఐఆర్​ (ఇన్​ఫ్రా-రెడ్) బ్లాస్టర్​ ఉంటే ఫోన్​ను యూనివర్సల్​ రిమోట్​గా మార్చుకోవచ్చు. షావోమీ వంటి కొన్ని బ్రాండ్​ ఫోన్లలో ‘ఇన్​బిల్ట్ రిమోట్’ కూడా ఉంటుంది. ఇలాంటి ఫోన్లను ఇంట్లోని ఎయిర్​ కండీషనర్లు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్స్​వస్తువులను ఆపరేట్​ చేసేందుకు వాడుకోవచ్చు. ఈ ఒక్కదానితోనే అనేక స్మార్ట్​ డివైజెస్​ ఆపరేట్​చేయొచ్చు కాబట్టి, వేర్వేరు రిమోట్ల అవసరం తగ్గుతుంది. ‘ఎయిర్​ ప్యూరిఫయర్లు, అమెజాన్​ ఫైర్​ టీవీ స్టిక్’ వంటివి ఆపరేట్​ చేసేందుకు ఫోన్లో ప్రత్యేక యాప్​లు ఇన్​స్టాల్​ చేసుకుని వాడుకోవచ్చు.

సెక్యూరిటీ కెమెరా

మీరు పక్కన పెట్టిన పాత ఫోన్లో కెమెరా బాగా పనిచేస్తోందా? ఇంటర్నెట్​ యాక్సెస్​ చేయగలదా? అయితే ఆ ఫోన్​ను ఇంట్లో సెక్యూరిటీ కెమెరాగా వాడుకోండి. ఇంట్లో మీకు కావాల్సిన చోటును కెమెరా క్యాప్చర్​ చేసేలా ఫోన్​ను ఫిక్స్​ చేయండి. దానికి ఫుల్​ చార్జింగ్​ ఉండేలా చూడాలి. అలాగే నెట్​ కనెక్షన్​ తప్పనిసరి. ‘ఐపీ వెబ్​క్యామ్, ఎట్​హోమ్​కెమెరా’ వంటి ఏదైనా యాప్​ ఇన్​స్టాల్​ చేసుకుని, కెమెరా ఆన్​ చేస్తే చాలు. ఆ ఫోన్​ నుంచి మీ ఫోన్​కు నెట్​ ద్వారా కనెక్ట్​ చేసుకుని అక్కడి దృశ్యాల్ని స్ట్రీమ్​ చేసుకోవచ్చు. ఎక్కడున్నా ఇంట్లో ఏం జరుగుతుందో చూడొచ్చు. ఇంట్లో పిల్లలు, వృద్ధులు, పెంపుడు జంతువులను నిత్యం గమనిస్తూ ఉండాలంటే ఈ టెక్నిక్​ వాడుకోవచ్చు. అయితే ఫోన్​ చార్జింగ్, ఇంటర్నెట్​ ఉండేలా చూసుకోవాలి. పాత ఫోన్లలో కెమెరా బాగుండి, వీడియో రికార్డింగ్​ చేయగలిగితే కార్​ డ్యాష్-క్యామ్​గా వాడొచ్చు. కారులో వీడియో రికార్డింగ్​ ఆన్ లో ఉంచాలి.

యునిఫైడ్ రిమోట్

ఫోన్లో ‘యునిఫైడ్​ రిమోట్’ అనే యాప్​ ఇన్​స్టాల్​ చేసుకుంటే పర్సనల్​ కంప్యూటర్ కు వైర్​లెస్​ కంట్రోలర్​గా వాడుకోవచ్చు. ఇది ‘విండోస్,  మ్యాక్, లైనక్స్ బేస్​డ్​ కంప్యూటర్ల’పై అనేక ఫంక్షన్స్​ నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. ‘వైర్​లెస్​ కీబోర్డ్, మిర్రరింగ్​ పీసీ స్క్రీన్, ఫైల్​ మేనేజర్, క్రోమ్​ రిమోట్​ డెస్క్​టాప్’ వంటి సర్వీసెస్​ అందిస్తుంది ఈ యాప్.